తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి కాంగ్రెస్ నాయకులు హడలిపోతున్నారు. తమ పార్టీ మనుగడే ప్రశ్నార్దకమవుతుందనే ఆందోళన వారిలో ఏర్పడింది. టిడిపి నేతలను టిఆర్‌ఎస్ లాక్కుంటున్నప్పుడు రేవంత్‌రెడ్డి, రమణ వంటి టిడిపి నాయకులు ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉండేందుకు కలిసి పోరాడుదామని కాంగ్రెస్ నాయకులను కోరారు. కానీ అప్పుడు కేసీఆర్ చర్యలను ఖండించకుండా కాంగ్రెస్ నేతలు మౌన పాత్ర పోషించారు. చివరకు అదే ఆపరేషన్ ఆకర్ష్‌ను ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్‌పై ప్రయోగిస్తుండటంతో టి.కాంగ్రెస్ నేతలకు చమటలు పడుతున్నాయి. దీనిపై చర్చించేందుకు టి.కాంగ్రెస్ సీనియర్ నేతలైన వి.హన్మంతరావు, పాల్వాయి గోవర్దన్‌రెడ్డిలు ఢిల్లీలోని సీనియర్ నాయకులను, సోనియాను కలిసి తెలంగాణలో టిఆర్‌ఎస్ చేపట్టిన ఫిరాయింపు ప్రోత్సాహాలపై తమ నాయకురాలికి విన్నవించుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను వీరు సోనియాకు పూసగుచ్చినట్లు చెప్పారట. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరికి విరుగుడు మంత్రం ఏదైనా సూచించాలని ఆమెను కోరారని సమాచారం. రాష్ట్రంలో ఫిరాయింపులను ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన వారిపైన న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని వారు తమ అధినేత్రికి ఫిర్యాదు చేశారని సమాచారం. అలాగే కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న గ్రూప్‌రాజకీయాల గురించి సోనియా వీరిని అడిగి సమాచారం తీసుకుందని తెలుస్తోంది. అలాగే మరలా కాంగ్రెస్‌ను క్షేత్రస్దాయి నుండి బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సోనియా వారికి హితోపదేశం చేసిందట. కాగా కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిదులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్, షబ్బీర్‌అలీతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడి సుప్రీం కోర్డు న్యాయవాదులతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు చాలా దారుణం గా మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది.