ఏపీలో ఎలాగూ దిక్కులేదు.. కనీసం తెలంగాణలోనైనా బలపడదామని ఆశపడుతున్న కాంగ్రెస్‌కు అక్కడి పరిణామాలు మింగుడు పడటం లేదు. తెలంగాణను ఇచ్చి ఇటు ఏపీలో, అటు తెలంగాణలో ఎటూ కాకుండా పోయింది ఆ పార్టీ పరిస్దితి. తెలంగాణ ఇచ్చిన ఘనతైనా తమకు దక్కుతుందని ఆశిస్తే ఆ క్రెడిట్ కాస్తా టిఆర్‌ఎస్‌కు వెళ్లిపోయింది. పోనీ కేసీఆర్ అయినా మాటకు నిలబడి తెలంగాణ ఇచ్చినందుకు టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడని భావిస్తే ఆయన కాస్తా కాంగ్రెస్ హైకమాండ్‌కు ఝులక్ ఇచ్చాడు. అయినా ఆ పార్టీ టి. నాయకులు మాత్రం 2019లో మాత్రం తమదే అధికారం అని కలల్లో బతుకుతున్నారు. గెెలిచే అవకాశం లేనప్పటికీ ఆ పార్టీ నాయకుల దింపుడు కళ్లెం ఆశలు వదలడం లేదు. 2019లో తాము గెలిస్తే ముఖ్యమంత్రిని నేనంటే నేను అని ఇప్పటినుండే రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. సీఎల్‌పీ నేత జానారెడ్డి ఇప్పటికే సీఎంను నేనే అని ప్రకటించేసుకున్నాడు. ఇక టి.పిసిసి చీఫ్ విషయంలో కూడా పోటాపోటీ పడుతున్నారు. ఆ పదవిలో ఉన్న ఉత్తమ్‌కుమార్ వేస్ట్ అంటూ వారిలో వారే గబ్బుపడుతున్నారు. ఉత్తమ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ కూడా సంతృప్తిగా లేదని సమాచారం. సో.. కొత్త పిసిసి చీప్‌ను త్వరలోనే నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ పోస్ట్‌పై సీనియర్‌నేత వి.హన్మంతరావు నుండి డి.కె. అరుణ వరకు ఆశలు పెట్టుకొని ఉన్నారు. బాగా పనిచేసిన వారికే పదవి దక్కుతుందని భావిస్తున్న ఆశాజీవులు జిల్లాల పర్యటనలు చేస్తూ మేము ఎక్కువగా కష్టపడుతున్నాం.. అంటే కాదు ..కాదు.. మేమే ఎక్కువగా కష్టపడుతున్నాం.. అని హైకమాండ్ దృష్టిలో పడాలని ఆశలు పెంచుకుంటున్నారు. మరి చివరకు ఈ పదవి ఎవరిని వరిస్తుందో చూడాల్సివుంది...!