వైసీపీ నుండి టిడిపిలోకి ఎలాగూ వలసలు జరుగుతున్నాయి. మరోవైపు టిడిపి నుండి కూడా తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నాడు. కొత్తగా వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టిడిపి ఇన్‌చార్జ్‌లుగా ఉన్నవారిని, మరికొంతమంది అసంతృప్తి వాదులను వైసీపీలోకి తీసుకోవాలనేది జగన్ భావన. కానీ అధికార పార్టీ నుండి ఎవ్వరూ వైసీపీలోకి వెళ్లరనే సంగతి స్పష్టమవుతోంది. దీంతో జగన్ టిడిపిని టార్గెట్ చేయడం మానేసి కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా యాక్టివ్‌గా లేని నాయకులపై దృష్టి సారిస్తున్నాడు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖా మంత్రిగా పనిచేసిన ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహీదర్‌రెడ్డి ఇటీవల టిడిపిలో చేరాలని భావించాడు. కానీ ఆయనను చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు నుండి కూడా పెద్దగా స్పందన రాలేదు. దాంతో మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై ఆయన ఇటీవల వై.వి.సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలను కూడా కలిసి చర్చలు జరిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ హైదరాబాద్‌కు రాగానే ఆయన సమక్షంలో మహీధర్‌రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి టిడిపిలోకి వెళ్లలేకపోతున్న ఇలాంటి చెత్త సరుకు మాత్రమే వైసీపీలోకి వెళ్తుండటం వల్ల తమ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి.