సుబ్రహ్మణ్యస్వామి... ఓ బ్రాండ్‌నేమ్.. ఓ జీనియస్... కొందరికి ఆయనతో స్నేహం చాలా సరదా... మరికొందరికి ఆయన పేరంటేనే హడల్. సోనియా నుండి జయలలిత వరకు ఎందరో ఆయన బారిన పడిన వారే. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ కూడా ఆయన బాధితుల లిస్ట్‌లో చేరాడు. అయితే ఇప్పుడు స్వామి ఏకంగా మూడు అంశాలపై సంచలన ఆరోపణలు చేశాడు. డిగ్రీ విషయంలో మోదీని టార్గెట్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మెరిట్‌పై, ఆయన చదువు సందర్భంగా ఆయన ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని, ఆ విషయంలో తాను కేజ్రీవాల్ ను కోర్టుకి లాగుతానని స్పష్టం చేశాడు. మరోవైపు దేవస్దానాలపై, వాటిపై అజమాయిషీ చేస్తున్న ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాడు. ఏ ప్రభుత్వానికి దేవాలయాలపైన మూడేళ్లకు మించి అజమాయిషీ ఉండరాదని, తిరుమల విషయంలో ఏపీ గవర్నమెంట్ చేస్తున్న పనులపై మండిపడ్డాడు. దేవస్ధానాలను నిర్వహించడానికి దార్మిక సంస్థలు ముందుకు రావాలని, ఈవిషయంలో తాను కోర్టులో కేసు వేస్తానని అంటున్నాడు.ఇక ఆర్దిక మంత్రి, మోడీ సన్నిహితుడైన అరుణ్‌జైట్లీపై పరోక్షంగా విమర్శలు సంధించాడు. మన మంత్రులు విదేశాల్లో సూట్లు వేస్తే వెయిటర్లుగా ఉంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఒకటి తర్వాత ఒకటి అనే పద్దతి పాటించే స్వామి ఈసారి మాత్రం ఏకంగా ఒకేసారి మూడు విషయాలను రచ్చ చేయడానికి నిర్ణయిచడంతో తదుపరి వంతు ఎవరిదా? అని అందరూ జడుసుకుంటున్నారు.