తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఇప్పుడు అదే అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఏపీ క్యాబినెట్‌లో ఇద్దరు తెలుగుదేశం నేతలు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన కె.ఈ.కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం హోదాలో రెవిన్యూశాఖను నిర్వర్తిస్తుండగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చిన్నరాజప్ప డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖను నిర్వహిస్తున్నాడు. అయితే బాబు ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలకు కొన్ని బాధ్యతలను తప్పించి తానే కీలకనిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న బదిలీల్లో భాగంగా వీరిద్దరి శాఖల పరిధిలోకి వచ్చే రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్లు (ఆర్డీవో), డివిజినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ల బదిలీల్లో ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలు వేలు పెట్టకుండా ఉండాలనే ఉద్ధేశ్యంతో ఆయా బదిలీలను తన కంట్రోల్‌లోకి బాబు తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పోస్టుల విషయంలో జరిగే అవినీతి, రాజకీయ జోక్యాలను పక్కనపెట్టేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరుక్షణం రంగంలోకి దిగిన చంద్రబాబు బదిలీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 15మంది ఆర్డీవోలను, 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.