సూపర్‌స్టార్ మహేష్‌బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటే ఏపీలో తెలియని వారు ఉండరు. మహేష్ సైతం తన జీవితానికి తన బావే స్ఫూర్తి అని చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఎన్నికల్లో తన ఎన్నికల ప్రచారం కోసం అద్దెకు తీసుకున్న ఓ భవంతిని అతి తక్కువ ధరకు కొట్టేయడానికి చక్రం తిప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గుంటుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తికి గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో 300 గజాలలో మూడంతస్దుల భవనం ఉంది. డబ్బు అవసరమై ఆయన 2013లో తన భవనాన్ని ఆంధ్రా బ్యాంకులో తాకట్టుపెట్టి 2.3కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. అయితే ఆయన ఆర్దికపరిస్దితి దెబ్బతినడంతో బ్యాంకుకు నెలవారి వాయిదాలు కట్టలేకపోయాడు. ఇలాంటి సమయంలో 2014లో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాల కోసం ఈ భవంతిని అద్దెకు తీసుకున్నాడు. ఆ తరుణంలో ఈ భవంతి యజమాని బ్యాంకుకు వాయిదాలు చెల్లించడం లేదనే విషయాన్ని తెలుసుకొని బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ భవనాన్ని వేలానికి తీసుకొని వచ్చేలా చేశాడు. అంతేకాదు.. ఆంధ్రాబ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై ఈ భవనం రిజర్వ్ ధరను మరీ తగ్గించి చూపించేలా చేశాడు. వాస్తవానికి మార్కెట్ ధర 8కోట్లు ఉన్న ఈ భవంతి రిజర్వ్ ధరను 2.80కోట్లుగా చూపిస్తూ బ్యాంకు అధికారులు ఇటీవలే వేలం ప్రకటన జారీ చేశారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే పలువురిని గల్లా జయదేవ్ మనుషులు అధికార పార్టీ ఎంపీ ఉంటున్న ఇంటిని మీరు ఎలా కొంటారో చూస్తాం.. గల్లా జయదేవ్‌గారిని ఇల్లు ఖాళీ చేయించే దమ్ము మీకుందా? అని బెదిరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఏదైనా ఇంటిని వేలం వేయాలంటే ముందుగా ఇంటిని ఖాళీ చేయించి భవనాన్ని స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. ఇలాంటివేమీ చేయకుండానే బ్యాంకు అధికారులు వేలం వేయడానికి నిర్ణయించడంపై అందరూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.