మాస్ మహారాజాకు నిన్న మొన్నటివరకు ఎనర్జిటిక్ స్టార్‌గా పేరుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు కూడా చేస్తూ వచ్చాడు ఆయన. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు ఆ వేగమే ఆయన కొంప ముంచింది. సరైన కథలు ఎంచుకునే తీరిక లేకపోవడంతో ఏది పడితే అవి ఒప్పేసుకోవడం ఆయన కెరీర్‌కు శాపంగా మారింది. వేగం పెరిగి, క్వాలిటీ తగ్గటంతో ఒక దశలో వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఆ దశలో 'బలుపు' చిత్రం ఆయనకు మరలా కాస్త బూస్ట్ ఇచ్చింది. యువతరం హీరోలతో పోటీ పడాల్సిన సమయంలో ఆయనకు మంచి స్క్రిప్ట్‌లురావడం లేదు. మూస చిత్రాలు, కథలు వస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజకు 'బెంగాల్ టైగర్'తో పాటు పలు అపజయాలు ఎదురయ్యాయి. ఇక 'బెంగాల్‌టైగర్' తర్వాత మరలా ఆయనకు పెద్ద గ్యాప్ వస్తోంది. ఇప్పటివరకు మరో సినిమా ఆయన స్టార్ట్ చేయలేదు. అన్ని అనుకున్నట్లు జరిగివుంటే దిల్‌రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో సినిమా ఇప్పటికి పూర్తయ్యేదే. కానీ రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ కఠినంగా వ్యవహరించడంతో ఆయన సినిమా నుండి తప్పుకున్నాడు. అసలు సినిమాలే లేకపోవడం, వచ్చిన దానిని వద్దనడంతో ఆయనకు ఆర్దికంగా మరింత నష్టం చేకూరింది. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' చిత్రం చేయాలనుకున్నాడు. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. దీంతో రవితేజ కెరీర్‌లోని ఆరునెలలు అనవసరంగా వృథా అయిపోయాయి. ఇప్పటికైనా ఆయన తన కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోకపోతే ఆయన పరిస్దితి ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.