ముద్రగడ పద్మనాభం దీక్షతో ప్రజలను రెచ్చగొడుతున్నదనే సాకుతో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం సాక్షి ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయాన టిడిపి మంత్రులే మీడియా వద్ద నోరుజారారు. కానీ ఏపీలో సాక్షి ప్రసారాల నిలిపివేతకు, ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని తాము చెప్పలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ విషయంలో తాము ఎమ్మెస్‌ఓలకు ఆదేశాలు ఇవ్వలేదని, ప్రభుత్వం నుండి గానీ, పోలీసుల నుండి గానీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వలేదంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించాడు. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయస్దానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా మంత్రులు తాము ఆపేశామని చెప్పినప్పుడు ఆ వీడియో ఫుటేజ్‌ల రూపంలో కనుక న్యాయస్దానానికి అందిస్తే మాత్రం ఏపీ ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడి వాగనేలా? తర్వాత దాని కప్పిపుచ్చుకోవడానికి అబద్దాలు ఆడాల్సిన పని ఏలా? అని కొందరు టిడిపి సర్కార్‌పై సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ముద్రగడ దీక్ష సందర్బంగా సాక్షి టివి ప్రజలను, కాపులను రెచ్చగొట్టేలా వార్తలు ప్రసారం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని ప్రభుత్వం ధైర్యంగా న్యాయస్దానానికి తెలిపివుంటే బాగుండేదని కొందరి అభిప్రాయం.