త్వరలో సెట్స్‌పైకి వెళుతుందని భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇప్పటికీ ఆలస్యమవుతూనే ఉంది. తమిళ 'కత్తి'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 'ఠాగూర్' కన్నా మిన్నగా తెరకెక్కించేందుకు వినాయక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడని సమాచారం. గతంలో వచ్చిన 'ఠాగూర్' చిత్రంలోని డైలాగ్‌లు ఎలా పేలాయో అందరికీ తెలుసు. పలు సమస్యలపై గణాంకాల ఆధారంగా చిరు చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు కూడా వినాయక్ అదే రూటును ఫాలో అవుతున్నాడని సమాచారం. 'కత్తి' చిత్రం రైతు సమస్యల ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందు కోసం రైతుల బాధలు, వాళ్ల అప్పులు, రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరులు, వారు బడ్జెట్‌లో రైతుల కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌లు, రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వాల తీరు... ఇలా రైతు సమస్యలన్నీంటికీ సంబంధించిన గణాంకాలను సేకరించే పనిలో వినాయక్ వ్యవసాయ నిపుణుల నుండి లెక్కలు తీసుకుంటున్నాడట. మరి ఈ చిత్రంలోని డైలాగ్స్ ఎలా ఆకట్టుకుంటాయో వేచిచూడాల్సివుంది...!