మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి దోస్తీ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్దాపించినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి, చిరు చలవతో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు దగ్గరై ఆయన గవర్నమెంట్‌లో కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు. కాగా ఇటీవల కాలంలో చంద్రబాబు.. గంటాను పక్కనపెడుతున్నాడని, కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆయనను పరిగణనలోకి తీసుకోవడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ఆయన మంత్రిత్వ పనితీరు నచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి సమక్షంలోనే గంటా ఇచ్చిన ఫైళ్లను విసిరేసి, బాగా కోపగించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన వ్యతిరేక వర్గమైన అయ్యన్నపాత్రుడు వంటివారికి ఇది ఆనందం అనిపించినా ఆయన వియ్యంకుడు, చంద్రబాబు నమ్మినబంటు అయిన మున్సిపల్ శాఖామంత్రి నారాయణకు మాత్రం ఈ పరిణామం మింగుడుపడటం లేదు. కాగా చంద్రబాబులో ఉన్న మైనస్ ఏమిటంటే... ఆయన మంచివారు సలహాలు ఇస్తే తీసుకోరు. అదే తప్పుడు సలహాలు, పితూరీలు చెప్పేమాటలు మాత్రం బాగా వింటారనే పేరుంది. తాజాగా మంత్రివర్గంలోని కొందరు చంద్రబాబు సన్నిహితులు మాత్రం గంటాను నమ్మవద్దని, ఆయన చిరంజీవికి కోవర్టు అని, తాము అంతర్గతంగా తీసుకునే పలు నిర్ణయాలు ఆయన వల్ల చిరు చెవిన చేరుతున్నాయని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా తాను కూడా అదే ఉద్దేశ్యంలో ఉన్నట్లు చంద్రబాబు కూడా తనను కలిసిన వారికి తెలియజేశాడట. సో.. కృష్ణా పుష్కరాల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు గంటాను మంత్రి పదవి నుండి తప్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.