అధికార టిఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకుంటూనే ఉన్నాయి. దాంతో ఎప్పుడు ఏ ప్రతిపక్షనేత గులాబి కండువా కప్పుకుంటాడో తెలియని పరిస్థితి, టిఆర్‌ఎస్‌లో తప్ప తమకు ఇతర పార్టీలలో మనుగడ కష్టమని ప్రతిపక్షపార్టీల నాయకులు భావిస్తుండటమే దీనికి అసలు కారణం. దీంతో ప్రతిపక్షపార్టీలు ఉనికిని కోల్పోతున్న పరిస్ధితి. దానికి బలం చేకూరుస్తూ... ఎన్నికలు ఏవైనా సరే తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌కే మద్దతు పలుకుతున్న స్దితి. కాగా అధికారపార్టీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులే చక్కదిద్దుతున్నారు. దీంతో కేటీఆర్, హరీష్‌ల దగ్గరకు వచ్చిన తర్వాతే అసలు విషయాలు కేసీఆర్‌కు చేరుతున్నాయి. కొన్నిసార్లు కేసీఆర్ ఓకే చెప్పకముందే వలసలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు కేటీఆర్,హరీష్‌రావులు.
దీనికి బలం చేకూరుస్తూ తాజాగా టిఆర్‌ఎస్‌లో చేరిన సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అసలు తమ పార్టీలో చేరుతున్నాడని తనకే తెలియదని కేసీఆర్ చెప్పడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఎంపీ గుత్తా, వివేక్, వినోద్ తదితరులతో కలిసి నల్లగొండ జిల్లా దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. రవీంద్ర నాయక్ కు కండువా కప్పుతూ మీడియాతో మాట్లాడిన కేసీఆర్ రవీంద్ర నాయక్ తమ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటివరకు తనకు తెలియదని వ్యాఖ్యానించడం అక్కడ ఉన్న వారిని షాక్‌కు గురిచేసింది. దీంతో నాయక్ కూడా కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ అంతలోనే తేరుకున్న కేసీఆర్ తనకు తెలియకపోయినా రవీంద్ర నాయక్ చేరిక అద్బుతమని పొగడటం తో ఈ వివాదం ముగిసింది. మొత్తానికి కేసీఆర్‌కు ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ వలసదారుల విషయంలో కేటీఆర్, హరీష్‌రావులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇటీవల వస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది.