తనకు నచ్చిన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు తన సినిమాల ద్వారా కాకుండా తన ట్వీట్స్ ద్వారా ప్రచారంలో ఉండాలని అలోచించే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. టాలీవుడ్‌లో ఉన్నంతకాలం ఇక్కడి స్టార్స్‌ను టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు కూడా అమితాబ్‌బచ్చన్‌ను ఆకాశానికి ఎత్తుతూ రజనీకాంత్, చిరంజీవి వంటి సౌత్ స్టార్స్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఆయన అమితాబ్‌బచ్చన్‌తో 'సర్కార్3' కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ ప్రదానపాత్రలో నటించిన 'తీన్' సినిమా చూసిన వర్మ అమితాబ్‌పై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించాడు. అమితాబ్ హీరోయిక్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను చేసి కూడా మెప్పించగలడని, కానీ రజనీ, చిరంజీవి వంటి వారు అలా చేయలేరని కామెంట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడం కోసం తన ఇమేజ్‌ను సైతం పక్కనపెట్టి అమితాబ్ ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తాడని, కానీ రజనీ, చిరులు ఆ పని చేయలేరని దుయ్యబట్టాడు. 'తీన్'లాంటి చిత్రాన్ని రజనీ చేస్తే ఎవ్వరూ చూడరని, కానీ 'రోబో' వంటి చిత్రాన్ని అమితాబ్ చేస్తే ఇంకాపెద్ద హిట్ అవుతుందని తెలిపాడు. 'తీన్, పీకూ, బ్లాక్' వంటి చిత్రాలు చేస్తే రజనీ,చిరులు నవ్వులపాలవుతారని వ్యాఖ్యానించాడు. 'తీన్' చిత్రాన్ని రజనీ చేస్తే కేవలం ఒకే మార్క్ పడుతుందని, అదే అమితాబ్ చేస్తే వంద కంటే ఎక్కువ మార్కులు పడతాయని ఆయన ట్వీట్ చేశాడు. తన మాటలకు రజనీ స్పందించాలని వర్మ డిమాండ్ చేయడం ఇక్కడ కొసమెరుపు.