ఏపీ బిజెపి అధ్యక్షునిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీ కాలం ముగిసి ఇప్పటికే రెండునెలలు దాటుతోంది. ఈ విషయంలో ఎవరిని తదుపరి బిజెపి అధ్యక్షుడిని చేయాలనే విషయంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. దాంతో పదవీకాలం పూర్తయినా సరే కంభంపాటి హరిబాబే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆ పదవికి మొదట సోము వీర్రాజును నియమిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన అభ్యర్దిత్వం పట్ల బిజెపి మిత్రపక్షమైన టిడిపి సుముఖంగా లేదు. ఆయన్ను పార్టీ అధ్యక్షునిగా నియమిస్తే టిడిపి నుండి అభ్యంతరాలు రావడంతోపాటు బిజెపి రాష్ట్రంలో రెండు వర్గాలుగా చీలే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దాంతో బిజెపి అధిష్టానం సోమువీర్రాజును పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు కూడా వినిపించాయి. వారి అభ్యర్ధిత్వం పట్ల కూడా టిడిపి అనుకూలంగా లేదు. దీంతో మధ్యేమార్గంగా రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చల్లపల్లి నరసింహారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బిజెపి సీనియర్ నేత కావడంతో పాటు వివాదరహితునిగా ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన బిజెపి జాతీయ కిసాన్‌మోర్చా జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహిస్తున్నారు. రాయలసీమలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను అధ్యక్షునిగా చేస్తే ఆ ప్రాంతం ప్రజలని, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను, నేతలను ఆయన బాగా ఆకర్షించగలడని బిజెపి అధిస్టానం ఆలోచిస్తోంది. అందునా ఆయనంటే టిడిపికి కూడా సానుకూలమే. రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడి బలమైన సామాజిక వర్గమైన రెడ్లు వైసీపీ వైపుకు మొగ్గారు. వారిని ఎలాగైనా బిజెపి ఆకర్షించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టిడిపితో బిజెపికి పొత్తు ఉంటుందో లేదో తెలియదని, అందువల్ల సోము వీర్రాజునే అందలం ఎక్కించాలని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు.