ప్రతిపక్ష వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు, అధికారానికి లొంగిపోయారనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూతురు మరో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. డబ్బులకు అమ్ముడుపోయామనే వ్యాఖ్యలను ఖండిస్తూ, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వారు జగన్‌ను హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి మరలా ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ చేస్తున్న డిమాండ్‌ను తాము అంగీకరిస్తున్నామని, ఒకవేళ ఆ ఎన్నికల్లో తమ చేతిలో వైసీనీ అభ్యర్దులు ఓడిపోతే జగన్ తన వైసీపీ పార్టీని మూసివేయడానికి సిద్దమా? అని ప్రశ్నించిన భూమా తన డిమాండ్‌పై జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డబ్బులకు అమ్ముడుపోయేంత చీప్‌గా తాము జగన్‌కు కనిపిస్తున్నామా? డబ్బులకు లొంగిపోవడంలో జగనే అందరికంటే ముందుంటాడని ఘాటైన విమర్శలు చేశారు. తమకు ఉన్నది డబ్బుబలం కాదని, ప్రజాబలమని, బ్రిటిష్ హయాం నుండే తాము ఆర్దికంగా మంచి స్దితిమంతులమని ఆయన జగన్‌కు సూచించారు. తాము 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తన మామ, తన చనిపోయిన శ్రీమతి, తన కూతురు.. ఇలా అందరం రాజకీయాల్లోనే ఉన్నామని, తమ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి జగన్ పుట్టలేదని ఎద్దెవా చేశారు. తెలంగాణలోని వైసీపీ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరితే కనీసం మాట మాత్రంగానైనా కేసీఆర్‌ను ఒక్క మాట అనని జగన్, ఏపీలో మాత్రం తమపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరి భూమా తిరిగి పోటీ చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసిన నేపథ్యంలో జగన్ భూమా సవాల్‌ను స్వీకరిస్తారా? ఎలా స్పందిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది.