కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే కాపు నేతలందరూ ఒకటైనా అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత పవన్ మాత్రం ఇప్పటివరకు ఆయన విషయంలో స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ స్పందించాలని మీడియా ముఖ్యంగా కూడా ఆయనకు విజ్ఞప్తులు వెళ్లినా వాటిని పవన్ పట్టించుకోలేదు. తాజా సమాచారం ప్రకారం పవన్ కాపుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. తాను కాపుల తరపున నిలబడితే అందరివాడుగా తనకు ఉన్న ఇమేజ్‌కు భంగం కలుగుతుందని భావించిన పవన్ ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముద్రగడను ఆగష్టులో వచ్చే మంజునాథన్ కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందిగా, అప్పటివరకు దీక్ష విరమించమని ముద్రగడకు ఇతర కాపు నాయకులకు తన అభిప్రాయంగా పవన్ చెప్పే అవకాశం ఉందని టిడిపి నేతలు ఎన్నో ఆశలతో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుండో ఆగష్టు సంక్షోభం వస్తూనే ఉంది. ప్రతిసారి ఆ పార్టీలో ఆగష్టులో అనూహ్యమైనమార్పులు జరుగుతూ, సంక్షోభం ఏర్పడుతూనే వస్తోంది. ఈసారి కూడా చంద్రబాబు ముద్రగడ విషయంలో పంతానికి పోతే ఆగష్టు సంక్షోభం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించని సంక్షోభం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందులోనూ కాపుల రిజర్వేషన్లు తదితర పరిణామాలు చాలా సున్నితమైనవి అందులోనూ బహు ప్రమాదకరమైనవి. ముద్రగడ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన చాలా మొండిఘటం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు మిత్రపక్షం వాడిగా, ముద్రగడ మనస్తత్వం తెలిసిన వాడిగా పవన్ పోషించబోయే పాత్ర కీలకంకానుంది.