ఇద్దరి మధ్య విభేదాలున్నా కులం కోసం ఒక్కటైన ఘనత చిరంజీవి, దాసరికి చెల్లుతుంది. కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఉండకూడదు. వారు అందరికీ చెందుతారు. తమ సినిమాల ద్వారా కులాన్ని ఎండగట్టిన అనేక సన్నివేశాలను వారు చూపించారు. కానీ ఇప్పుడు మాత్రం కాపుల కోసం యుగళగీతం వినిపిస్తున్నారు. చిరంజీవి, దాసరి చర్యలు చిత్ర పరిశ్రమ విస్తుపోయేలా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ముద్రగడ చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉందని ఎలాంటి బెరుకులేకుండా దాసరి ప్రకటించారు. పక్కనే ఉన్న చిరంజీవి సై అన్నారు.
చిత్ర పరిశ్రమలో కులపోరాటానికి వీరి చర్యలు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చిరంజీవి కూడా ఒక కులం తరుపున మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. కాపు కులస్తులు ఆయనను తమవాడిగా ఎన్నడూ చూడలేదు. అందుకే కాపుబలగం ఎక్కువగా ఉన్న పాలకొల్లులో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చిత్తుగా ఓడించారు. అన్ని కులాల ఓట్లు ఉన్న తిరుపతిలో మాత్రం గెలిపించారు. ఈ విషయం చిరంజీవి గుర్తెరగక పోవడం పట్ల ఆయన అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఇక దాసరి విషయానికి వస్తే తన అనేక చిత్రాల్లో కులాలను ఎండగట్టారు. ప్రజలకు కులాల ప్రస్తావన లేని సమాజం రావాలంటూ హితబోధ చేశారు. అలాంటి దాసరి ఒక వర్గానికి వంతపాడడం విచిత్రం. అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఖాళీగా ఉన్న దాసరి సొంత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చతకు ఊతమిస్తున్నారు. తుని ఘటనలో దోషులకు సైతం శిక్షించకూడదంటున్నారు. ఆయన వితండవాదం ప్రమాదకరంగా కనిపిస్తోంది.
చిరంజీవి, దాసరి చర్యలు ఇతర కులాల ఆగ్రహానికి గురయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నాయనే విమర్శలున్నాయి.