ప్రజలెన్నుకున్న ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రశ్నించే అధికారం... విమర్శించే అధికారం... ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అధికారం ఎవరికైనాఉంటుంది. అంతేకానీ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసి, ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అని రెచ్చగొట్టే ధోరణిలో అల్టిమేటం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు కాపు నేతలు అనబడే పైసాకు కొరగాని వ్యక్తులు, వాస్తవానికి చెప్పాలంటే 60వేల కాపు ఓట్లున్న నియోజకవర్గంలో పదివేల ఓట్లు కూడా సంపాదించలేని నాయకులు ఇప్పుడు కాపులకు మేమంటే మేమున్నామంటూ కలిసిపోయి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పదే పదే ప్రభుత్వానికి డెడ్‌లైన్లు విధించడం సమంజసం కాదు. చిరంజీవి, దాసరి, బొత్స, రామచంద్రయ్య... వంటి నేతలకు అసలు ఎన్నికల్లో నిలబడి గెలిచే సత్తా ఉందా? అన్నది అసలు వాళ్ల రాజకీయ బలం ఏపాటిదో నిరూపిస్తుంది. ఇప్పటికైనా ముద్రగడ తానే కాపులందరికీ నాయకుడు అనుకుంటే ఏదో ఒక స్దానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో నిలబడి గెలిచి తనకు కాపులలోనే కాదు.. ప్రజల్లో కూడా బలం ఉందని నిరూపించుకునే ధైర్యం చేయగలడా?అని కొందరు కాపు నాయకులే సవాలు విసురుతున్నారు. ఇంతకీ ముద్రగడకు, ఆయన మద్దతుదారులకు కావాల్సింది ఏమిటి? ఒకవైపు ఆయనకు మద్దతు ఇస్తున్న నాయకులతోపాటు జగన్ సిబిఐ విచారణ కోరాడు. ముద్రగడ ఒప్పుకుంటే దానికి అంగీకారమే అని ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరి సమస్య ఏముంది? తమలో నిజాయితీ ఉంటే సిబిఐ విచారణకు ఒప్పుకోవచ్చు కదా...! అంతేగానీ తుని సంఘటనలకు బాధ్యులైన వారిని విడిచిపెట్టాలనికోరడం ఎంతవరకు సమంజసం? రేపు అదే జరిగితే మిగతా కులాలకు, మిగిలిన సమాజానికి మనం ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి? కులం నీడలో ఏ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా తమకు ఏమీ కాదనే నమ్మకం సంఘవిద్రోహ శక్తుల మనసుల్లో నాటడం కాదా? దీనికి ముందుగా ముద్రగడ, మిగిలిన నాయకులు సమాధానం చెప్పాల్సివుంది....!