పాత్రలో నటించడం కాదు జీవించాలి అని ఊరికే అంటే సరిపోదు. దానికి కావాల్సిన సరంజామాను, కష్టాన్ని తెర మీద చూపించే ముందు ఆఫ్ స్క్రీన్ చేయాల్సిన శ్రమను చాలా మంది గుర్తించరు. ఎందుకంటే బయటి వారికి సినిమా చూసామా అన్న ధ్యాసే తప్పితే ఆయా పాత్రల కోసం ఆయా నటులు పడే కష్టం కనపడదు. అదే ఇండస్ట్రీలోని వ్యక్తులకు మాత్రం ఓ పాత్ర కోసం కొందరు నటులు పడే తపన తెలిసిన ప్రతిసారీ వారిని అభినందించకుండా ఉండలేరు. తమిళంలో విక్రం, కమల్ హాసన్ లాగా హిందీలో ఆమిర్ ఖాన్ పాత్రల్లో జీవించడానికి తెగ కష్టపడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన డంగల్ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. మహావీర్ ఫొగట్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో ఆమిర్ మల్లయుద్ధ వీరుడిగా, ఇద్దరు బిడ్డలకు తండ్రిగా, వారికి కోచింగ్ ఇచ్చే గురువుగా విభిన్న ఛాయలున్న పాత్రను చేస్తున్నాడు. మహావీర్ యువకుడిగా ఉన్నప్పటి దృశ్యాల చిత్రీకరణ కోసం ఇదిగో మీరు పైన చూస్తున్నారుగా ఎంతలా బాడీని పెంచాడో. ఈ వయసులో ఇంతలా చెమటోడ్చే ఆర్టిస్టులు ఉన్నారు గనకే ఇండియన్ సినిమా అంతర్జాతీయంగా ఎన్నో మన్ననలు పొందుతోంది. ఇక మనందరం క్రిస్మస్ పండక్కి రానున్న డంగల్ సినిమా కోసం వేచి చూద్దాం.