ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మగౌరవం అనేది అతి పెద్ద ముఖ్యాంశం. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దెబ్బతినడానికి ఆ పార్టీ అధినేత, నాయకులు ఆత్మగౌరవ నినాదం విషయంలో తీసుకున్న పొరపాటు నిర్ణయాలే కారణం అని చెప్పవచ్చు. తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు, ఏపీ సీఎం వియ్యంకుడు, నటసింహం, హిందూపురం ఎమ్మేల్యే బాలకృష్ణ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు మరోసారి తెలంగాణ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనేది కఠోర వాస్తవం. తామే లేకపోతే తెలంగాణ ప్రజలకు తెల్లన్నం తినే స్దాయి కూడా ఉండేది కాదన్నట్లు ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణలో టిడిపి మరింత బలహీనపడడానికి కారణం అవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఇప్పటికే టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అనాలోచితంగానో, లేక ఉద్దేశ్యపూర్వకంగానే టిడిపి తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన పలు వ్యాఖ్యలు దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.
నిజానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కంటే టిడిపిపైనే ఎక్కువ అభిమానం చూపారు. కానీ దాన్ని పార్టీ కాపాడుకోలేకపోయింది. ఎంతసేపటికీ తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్స్ సహాయంతో గట్టెక్కాలని ప్రయత్నించిందే కానీ ఏనాడు తెలంగాణ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లలేదు. దీంతో ఈ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ కూడా పార్టీని వీడింది. మరలా భవిష్యత్తులోనైనా టిడిపి తెలంగాణలో పాగా వేయాలనుకుంటే బాలయ్యతో పాటు అదే తరహాలో మాట్లాడుతున్న ఏపీ నాయకులు కాస్త జాగరూకతతో ఉండాల్సివుంది. కానీ దానిని ఆ పార్టీవారు చేయలేకపోతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతో భవిష్యత్తులో కూడా తెలంగాణలో టిడిపి బలపడే అవకాశాలు కనిపించడం లేదు. పోనీ తెలంగాణను వదిలేసి కేవలం ఆంధ్రా మీదనే ఫోకస్ పెట్టాలనే నిర్ణయం తీసుకుంటే టిడిపి కూడా టిఆర్‌ఎస్ తరహాలో పక్కా ఆంద్రా పార్టీగా ముందుకు వెళ్లితే కనీసం ఏపీ అయినా మిగులుతుంది. కానీ రెండు పడవల ప్రయాణం చేస్తూ మధ్యలో ఈ తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ పార్టీకి ఏవిధంగానూ ఉపయోగపడవని చెప్పాలి.