ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది హీరో నితిన్ పేరే. నితిన్ కు పవన్ అంటే అంత ఇష్టం మరి. అతన్ని ఓ దేవుడులా కొలుస్తుంటాడు ఈ యంగ్ హీరో. నితిన్ కెరీర్ లో దాదాపు ఓ పది సంవత్సరాల వరకు హిట్స్ లేవు. ఆ సమయంలో తను నటించిన 'ఇష్క్' సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ అతిథిగా విచ్చేసి పాటలను తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి.. నితిన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్, నితిన్ కు సెంటిమెంట్ గా మారిపోయాడు. రీసెంట్ గా తను నటించిన 'అ ఆ' సినిమా ఆడియోను కూడా పవన్ కళ్యాణే రిలీజ్ చేసి, నితిన్ నాకు తమ్ముడి లాంటి వాడు. తను నటించిన ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశీర్వదించాడు. నిజంగానే 'అ ఆ' నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను గుంటూరులో చాలా గ్రాండ్ గా నిర్వహించారు చిత్రబృందం. ఈ కార్యక్రమంలో నితిన్, పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'అ ఆ' ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు నన్ను తమ్ముడు అన్నారు. ఇకపై నేను ఆయన్ని అన్నయ్య అనే పిలుస్తాను. కళ్యాణ్ గారు గెస్ట్ గా వచ్చిన నా రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. 'అ ఆ' సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి కళ్యాణ్ గారిపై ఎంతో గౌరవముందని చెప్పాడు.