సమాజంలో విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నప్పుడు తమ మాటలతో దానికి ఆజ్యం పోసే బదులు మౌనమే శ్రేయస్కరం. అనవసర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే పరిస్థితులకు రాకుండా ఉండాలంటే ముందు రాజకీయనాయకులు కూడా ఆ ఉద్రిక్త పరిస్ధితులను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మాట్లాడకుండా కొద్దికాలం అంటే సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మౌనంగా ఉండటమే మంచిది. ఈ విషయం మన సిపిఐ నేత నారాయణకు తెలిసినట్లుగా లేదు. కులాలకు, మతాలకు దూరంగా ఉంటామని చెప్పే వామపక్షాలు కులం, మతం రంగు పులుముకొని చాలా కాలమే అయింది. వారి పార్టీల్లో ఇప్పుడు కులాల పేరుతో అంతర్గత కుమ్ములాటలు మొదలయిన విషయం కళ్లున్న కబోదులైన ఆ పార్టీ నాయకులకు తెలియకపోవచ్చు గానీ ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అన్నది వాస్తవం. ఇక చైనాలో వానలు పడితే ఇండియాలో గొడుగులు పట్టే వామపక్షాల వైఖరికి మన ప్రజలు కూడా విసిగిపోయారు. అందుకు రోజు రోజుకు దేశంలో కనుమరుగవుతున్న వామపక్షబలం ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే సిపిఐ నాయకుడు నారాయణ మాట్లాడుతూ... కాపుల కోసం ముద్రగడ దీక్షలు చేస్తూ ఆసుపత్రిలో ఉంటే పవన్ ఏమి చేస్తున్నాడని? విమర్శించాడు. ఎప్పుడో ఒకసారి పవన్ మీడియా ముందుకు వచ్చి నీతులు చెబుతున్నారని, అవి వినడానికి ప్రజలు సిద్దంగా లేరని, రాజకీయాల్లో పవన్ ఓ జోకర్ అని నారాయణ విమర్శించారు. కాపుల కోసం ప్రాణాలకు తెగించి ముద్రగడ ఉద్యమం, దీక్ష చేస్తుంటే, పవన్ మాత్రం కాపుల కోసం ఏమైనా చేయడానికి సిద్దమని చెప్పి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నారాయణ ప్రశ్నిస్తున్నాడు. మీడియా ముందుకు హీరోలా వచ్చి జీరోలా వెళ్తున్నారని ఆయన పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. పవన్‌ను విమర్శించడం వరకు నారాయణ వ్యక్తిగత అభిప్రాయం కిందకు తీసుకున్నా కూడా... ముద్రగడను కాపుల కోసం దీక్ష చేస్తున్న మహానేతగా అభివర్ణించడం రాజకీయ దివాలాకోరుతనం కిందకే వస్తుంది. ఇప్పటివరకు కాపుల విషయంలో సిపిఐ ఇచ్చిన నిర్మాణాత్మక సూచనలు ఏమైనా ఉన్నాయా? అసలు ముద్రగడను వెనకేసుకురావడం నారాయణ వ్యక్తిగతమా? లేక ఆయన పార్టీ విధానమా? అనేది ముందు నారాయణ తేల్చిచెప్పాల్సివుంది.