యువరాజు నారా లోకేష్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయం ఎప్పుడో జరిగిపోయినా కూడా ఆ ముహూర్తం ఎప్పుడనే దానిపై ఇంతకాలం చర్చ జరుగుతోంది. ఒకవైపు పార్టీపరంగా మహానాడు, మహాసంకల్పదీక్ష వంటివి పూర్తి కావడంతో కృష్ణ పుష్కరాల అనంతరం జరిగే మంత్రివర్గ విస్తరణలో లోకేష్‌కు మంత్రిపదవి కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా లోకేష్‌ను శాసనమండలికి పంపడం లేదా గవర్నర్ కోటాలో పంపడం శ్రేయస్కరంగా బాబు భావిస్తున్నాడు. సెప్టెంబర్‌లో మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చని తెలుస్తోంది. మొదట్లో చంద్రబాబు లోకేష్‌ను రాజ్యసభకు పంపాలని భావించారు. కానీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, కావాల్సినన్ని నిధులను మంజూరు చేయకపోవడం వంటి కారణాల వల్ల రాజ్యసభకు లోకేష్‌ను పంపిస్తే దాన్ని చంద్రబాబు, లోకేష్‌ల వైఫల్యంగా ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు నచ్చజెప్పడంతో చంద్రబాబు ఆ ఆలోచన విరమించారు. మొత్తానికి లోకేష్‌కు త్వరలోనే రాష్ట్ర మంత్రిగా పట్టాభిషేకం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.