అక్కినేని మూడోతరం వారసుడిగా, మొదటి సినిమాకు ముందే యాడ్ ప్రపంచం ద్వారా దూసుకెళ్లి అందరిలో భారీ అంచనాలు పెంచేసిన హీరో అక్కినేని అఖిల్. వినాయక్ దర్శకత్వంలో ఆయన తెరంగేట్రం చేసిన 'అఖిల్' చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని సాధించి అందరినీ నిరాశ పరిచింది. దాంతో ఆయన తన రెండో చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి 'ఊపిరి' దర్శకుడు వంశీ పైడిపల్లి, 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్ హను రాఘవపూడి, కొరటాల శివ... ఇలా చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం అఖిల్, నాగార్జునలు అఖిల్ రెండో చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ చిత్రాన్ని 'అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్ కూడా ఓ కొలిక్కివచ్చిందని, వచ్చే వారం జరిగే ఫైనల్ డిస్కషన్స్‌లో ఈ స్క్రిప్ట్‌ను లాక్ చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వం అంటే ఈ చిత్రంలో ప్రొఫైల్ లో ఉంటుందని, అందువల్ల అనవసరంగా ఈ చిత్రంపై లేని పోని అంచనాలు ఉండవని అఖిల్, నాగ్‌లు ఓ నిర్ణయానికి వచ్చారు. అందులోనూ హనురాఘవపూడి తయారు చేసిన కథ ఓ వినూత్న ప్రేమకథ కావడం గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ అనౌన్స్‌మెంట్ మరో పదిరోజుల్లో రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్దిరోజుల్లో తెలుస్తాయి.