కొన్ని చిత్రాలు పెద్దగా స్టార్ కాస్ట్ లేకుండా దర్శకనిర్మాతలతో పాటు టెక్నీషియన్స్ పరంగా కూడా పెద్దగా గుర్తింపులేని చిత్రాలుగా అనుకోకుండా థియేటర్లలో విడుదలై సంచలన విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పెద్ద విజయాలు సాధిస్తూ ఉంటాయి. ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇటీవల వచ్చిన 'బిచ్చగాడు' చిత్రం కూడా అదే కోవలోకి చెందుతుంది. విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో రూపొంది విజయం సాదించిన 'పిచ్చైకారన్' చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ 'బిచ్చగాడు' పేరుతో డబ్ అయి విడుదలైంది. ఈ చిత్రం ఏకంగా మహేష్‌బాబు 'బ్రహ్మ్మోత్సవం' చిత్రంతో పోటీపడింది. 'బ్రహ్మ్మోత్సవం' చిత్రం డిజాస్టర్‌గా నిలవగా, 'బిచ్చగాడు' మాత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో రెండో వారం నుండి 'బ్రహ్మ్మోత్సవం' చిత్రం ఆడుతున్న పలు ధియేటర్లలో ఆ చిత్రాన్ని తీసి వేసి 'బిచ్చగాడు'ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని తమిళంలో విడుదలైన చాలా కాలానికి తెలుగులో రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈ చిత్ర నిర్మాతలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే రోజు విడుదల చేయాలని భావించారు. కానీ ఓ ఆసక్తికర అంశం కారణంగా అలా రిలీజ్ చేయలేకపోయారు. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే... ఈ చిత్రాన్ని తమిళ నిర్మాతలు దగ్గుబాటి రానా హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. కానీ రానా ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో తెలుగు వెర్షన్ లేటయింది. చివరకు తప్పని పరిస్దితుల్లో ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు. అదే ఈ చిత్రాన్ని రానా చేసి ఉంటే తెలుగులో కూడా ఈ చిత్రం రేంజ్ మారివుండేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి రానా ఓ మంచి అవకాశం మిస్సయ్యాడని చెప్పవచ్చు.