చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు అంటే చాలా ఎక్కువకాలమే అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లోని వారిపై రహస్య సర్వే చేయిస్తే దాదాపు సగానికి పైగా మంత్రుల పనితీరు అధ్వాన్నంగా ఉందని ఆ సర్వే తేల్చింది. ఈ విషయం బాబుకు కూడా తెలుసు. ఆయన మంత్రివర్గంలోని కొందరు మంత్రులుగా ఎందుకు పనికిరాని వారు ఉన్నారనేది అందరూ అంగీకరించే సత్యం. వీరి నిర్వాకం వల్లే బాబుకు ఉన్న కొద్దిపాటి గుడ్‌విల్ కూడా బూడిదపాలవుతోంది. కానీ ఇంతకాలం అయినా చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ మరోరకంగా చెప్పాలంటే మంత్రివర్గ ప్రక్షాళన ఎందుకు చేపట్టడం లేదనే దానిపై క్లారిటీ లేకుండా ఉంది. మంత్రివర్గం పనితీరు భేషుగ్గా ఉన్నప్పుడు మార్పులు ఎందుకులే అనుకోవచ్చు. స్వయాన ముఖ్యమంత్రి ఏరికోరి తెచ్చుకున్న పురపాలక మంత్రి నారాయణకే చివరి స్ధానం దక్కిన తర్వాత కూడా చంద్రబాబులో కదలిక లేకపోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే పార్టీలోకి వైసీపీ నుండి ఇతర పార్టీల నుండి వచ్చిన చాలా మంది నాయకులకు బాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఉన్నాడు. ఈ లిస్ట్‌లో కర్నూల్ నుండి భూమానాగిరెడ్డి, నెల్లూరు నుండి ఆనం రామనారాయణరెడ్డి, అనంతపురం జిల్లా నుండి చాంద్‌బాషా వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. వీరంతా మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. పదవికాలంలో సగం పూర్తి కావస్తోంది. కానీ చంద్రబాబులో కదలిక లేదు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గ విస్తరణ అంటే కొరివితో తలగోక్కోవడమే అని చంద్రబాబు సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నారట. అమాత్య పదవులను కోరుకుంటున్న వారిని మరి కొంత కాలం అదే కలలో ఉండనివ్వాలనేది చంద్రబాబు అండ్ కో వ్యూహంగా కనిపిస్తోంది. అసలే సమస్యల మీద సమస్యలు వచ్చిపడుతున్న తరుణంలో కొత్త తలనొప్పులు ఎందుకనేది బాబు అంతరంగంగా కనిపిస్తోంది.