ఇండియన్ మార్కెట్టు ఒక్క దాని మీదే తెలుగు సినిమా వాణిజ్య పనితనం ఆధారపడడం అనేది నిన్నటి మాట. ఎందుకంటే అమెరికాతో పాటుగా యూరోప్ ఖండంలోని చాలా దేశాల్లో, అలాగే గల్ఫ్, ఆస్ట్రేలియాలలో కూడా తెలుగు సినిమాకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఇక స్టార్ హీరో సినిమాలకయితే ఓపెనింగ్స్ డోఖా ఉండటంలేదు. లాంగ్ రన్ విషయానికి వస్తే ఏ హీరో అయినా సరే, మాకు నచ్చే ఫ్యామిలీ అంశాలు ఉంటె నెత్తిన పెట్టుకుంటాం అని ఈ ఏడాదిలో విడుదలయిన నేను శైలజ, పోయిన వారం రిలీజయి సూపర్ హిట్టయిన అఆ నిరూపించాయి. ఈ రెండింటి తర్వాత ఇప్పుడు వెంకటేష్ బాబు వంతు వచ్చింది. గత కొన్నాళ్ళుగా సినిమాలకి దూరంగా ఉన్న వెంకీకి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ విపరీతం అని తెలిసిందే. అలాగే దర్శకుడు మారుతీ కూడా భలే భలే మగాడివోయ్ సినిమాతో అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులో చోటు కొట్టేసాడు.
పూర్తి వినోదాత్మక చిత్రాలకే పెద్ద పీట వేస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు నచ్చి, మెచ్చే అంశాలతో వెంకటేష్ తదుపరి చిత్రం బాబు బంగారం రూపొందుతోంది అన్న సంగతి మొన్న రిలీజయిన టీజర్ భరోసా ఇచ్చింది. అఆ సాధించిన విజయంతో ఇప్పుడు అదే కోవలో కంప్లీట్ ఎంటర్ టైనరుగా రానున్న బాబు పైనే ఓవర్సీస్ బయ్యర్ల కన్ను బాగా పడింది. చూడబోతే వెంకటేష్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడని ట్రేడ్ వర్గాలు ముచ్చటించడం కనపడింది.