పూరీ జగన్నాథ్ సినిమాలంటే ఓస్ భలేగుందే అనిపించే హీరోయిజం మిస్సవ్వదు. గత కొన్ని చిత్రాలుగా కథను, కథనాన్ని వదిలేసి ఈ వట్టి హీరోయిజం మీదే బండి లాగిద్దాం అన్న ఆలోచనలతో పూరీ చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. అందుకేనేమో ఈయన గారి కథల మీద నమ్మకం లేని జూనియర్ ఎన్టీయార్ వక్కంతం వంశీ చేత కథ, కథనం రాయించుకుని పూరీ చేత టెంపర్ చేయించుకున్నాడు. సినిమా హిట్ అనిపించుకున్నా అటు వెంటనే వచ్చిన లోఫర్ చిత్రంతో మళ్ళీ పాత బాటే పట్టాడు పూరీ. అటువంటి ఈ కీలక తరుణంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం మీద విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. పైగా దీనికి కళ్యాణ్ రామ్ నిర్మాణ భాద్యతలు కూడా చేపట్టాడు. రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకి పొక్కడంతో నందమూరి అభిమానుల్లో ఓ కలత మొదలైంది. పూరీ ఈ చిత్రాన్ని శరవేగంగా తీస్తున్నాడా లేక చుట్టేస్తున్నాడా అని. పూరీ మెరుపు వేగంతో సినిమాలు తీసేయడం అదేలెండి చుట్టేయడంలో సిద్ధహస్తుడు. ఏ బడా హీరో డేట్లు ఇవ్వని సమయంలో ఆదుకొని ఎన్టీయార్ భరోసా మీద తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును కూడా చేజేతులా నాశనం చేస్తే ఇక చేసేది ఏమీ ఉండదు. పూరీ కాసింత జాగ్రత్త పడితే బాగుంటుంది.