'అఆ' సినిమా సక్సెస్ కావడం వల్ల నితిన్ కు ఎలాంటి ఉపయోగం? హీరోగా ఆయన మార్కెట్ పెరుగుతుందా? ఈ అనుమానాలు ఆయన సన్నిహితుల్లో ఉన్నాయి. అ ఆ త్రివిక్రమ్ సినిమాగానే ప్రచారం పొందింది. ప్రేక్షకులు కూడా అదే ఉద్దేశంతో థియేటర్లకు వచ్చారు. త్రివిక్రమ్ బ్రాండ్ అంటే అంత పాపులర్ అయింది. ఇకపోతే ఇందులో హీరోగా నటించిన నితిన్ కు వచ్చిన మార్కులెన్నీ అంటే ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. హిట్ సినిమాలో నితిన్ ఉన్నాడని మాత్రమే అంటారు. అంతేకానీ నితిన్ కు కొత్తగా వచ్చిన మైలేజ్ అంటూ ఏదీ లేదని ట్రేడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. సహజంగా హిట్ సినిమా తర్వాత వచ్చే అదే హీరో సినిమాకు మార్కెట్ పరంగా క్రేజ్ ఉండాలి. అలాంటి సూచనలు నితిన్ విషయంలో కనిపించడం లేదట. గతంలో 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలు హిట్ అయినప్పటికీ నితిన్ కు మార్కెట్ ఏ మాత్రం పెరగలేదు. ఆయన వెనుక తండ్రి అండదండలు ఉన్నాయి కాబట్టి సినిమా అవకాశాలు మాత్రం వస్తున్నాయని అనుకోవచ్చు. కాబట్టి నితిన్ మార్కెట్ అ ఆ తర్వాత కూడా గతంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది కానీ పెద్దగా మార్పు ఉండదనే మాట పరిశ్రమలో వినిపిస్తోంది.