మొత్తానికి చంద్రబాబు కూడా దూకుడు పెంచాడు. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలో కేసీఆర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలో త్రైపాక్షిక చర్చలు జరగాలని ఆయన కోరారు. కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలోగానీ, పాత విషయాలపై గానీ కేసీఆర్‌తో ముఖాముఖి చర్చలు జరిపేది లేదని కుండబద్దలు కొట్టారు. సిడబ్లుసీ, ఎపెక్స్ కౌన్సిల్‌ల జోక్యంతోనే సమస్యలు పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. పరస్పరం చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుందామని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. కానీ సిడబ్లుసీ, ఎపెక్స్ కౌన్సిల్‌ల జోక్యంతోనే చర్చలు జరగాలని చంద్రబాబు భావిస్తున్నాడు. అదే విషయాన్ని ఆయన తేల్చిచెప్పారు. నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రా ల పోలీసులు కొట్టుకునే
పరిస్దితి ఏర్పడిందని, అది తనకు చాలా బాధ కలిగించిందని, తాను అప్పుడు కేసీఆర్‌కు ఫోన్ చేసి ఇది ఇద్దరం సిగ్గుపడాల్సిన అంశం అని చెప్పానని ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో కేవలం కేసీఆర్‌తో చర్చించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని, కాబట్టి నదీజలాల పంపిణీ బోర్డులు, ఎపెక్స్ కౌన్సిల్ జోక్యంతోనే ఇవి పరిష్కారం అవుతాయని తాను భావిస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంతో చంద్రబాబు కూడా ఇక అన్ని విషయాలలో కఠినంగా మారుతున్న సంకేతాలను అందించాడని విశ్లేషకులు భావిస్తున్నారు.