ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చెప్పులతో కొట్టాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఈ వివాదం కలకలం రేపుతోంది. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలకనిర్ణయం తీసుకొంది. జూన్ 2ను పురస్కరించుకొని నవనిర్మాణదీక్షలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీన ఈ దీక్షలకు ముగింపుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో 'మహాసంకల్పం' పేరుతో ఓ భారీ సభను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ వేదికను ఒంగోలు నుండి కడపకు మార్చారు. ఈ మద్యకాలంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తున్నా అది విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుండటంతో రాయలసీమ ప్రజలు కాస్త ఫీలవుతున్నారని, అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నుండి కడపకు మార్చామని ప్రభుత్వం చెబుతున్నా కూడా, జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత జిల్లా అయిన కడప నుండే తిప్పికొట్టాలని, తాను మాత్రం రాష్ట్ర అభివృద్దికి ఇంత కృషి చేస్తూ ఉంటే జగన్‌మాత్రం తనను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విధానాన్ని తిప్పికొట్టేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.