ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కిందటి ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన టిడిపి, బిజెపిల తరపున ప్రచారం చేసి తన సత్తా చూపించి, టిడిపి, బిజెపి కూటమి గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను సున్నితంగా పరిశీలిస్తున్నాడని సమాచారం. ఆయనకు అటు చంద్రబాబు వైఖరితో పాటు బిజెపి వైఖరి కూడా నచ్చడం లేదని తెలుస్తోంది. కిందటి ఎన్నికల ప్రచారంలో పవన్ సాక్షిగా మోడీ ఏపీకి ప్రత్యేకహొదా ఇస్తామని వాగ్ధానం చేశారు. కానీ ఇప్పుడు మోడీ స్వరంతో పాటు ఏపీ బిజెపి నాయకుల వైఖరి కూడా మారుతోంది. వారు ప్రత్యేకహోదా విషయంలో డ్రామాలాడుతున్నారు. మోడీని ఈ విషయంలో ఒత్తిడి చేయడంలో చంద్రబాబు కూడా విఫలమవుతున్నాడు. కానీ రాష్ట్ర బిజెపి మాత్రం తమకు వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ తమకు మద్దతు ఇస్తాడని, జనసేనను పోటీకి దింపినా కూడా తమతో మిత్రపక్షంగా ఉంటాడని విర్రవీగుతోంది. కానీ పవన్ మౌనాన్ని ఆ పార్టీ నేతలు గ్రాంటెడ్‌గా భావిస్తూ తప్పు చేస్తున్నారనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ చంద్రబాబును వ్యతిరేకించినా తమను మాత్రం దరిచేరనిస్తాడనే ఆశలో బిజెపి నేతలు ఉన్నారు. కానీ పవన్ మౌనం వెనుక తుఫాన్ ముందటి నిశ్శబ్దం దాగుందని వారు గ్రహించలేకపోతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ ఒక్కడు రోడ్డెక్కితే చాలు, అన్ని అవే వస్తాయని పవన్ అభిమానులు అంటున్నారు. మొత్తానికి పవన్ ప్రస్తుతం వేచిచూసే దోరణిలో ఉన్నాడు. ఏమైనా తేడా కొట్టిందంటే చాలు దేశంలో బిజెపి పరిస్థితి ఏమో గానీ ఏపీలో బిజెపికి పుట్టగతులుండవనేది అర్ధం అవుతోంది.