రాజకీయాల్లో ఎత్తులు, ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు, అధికారంలో ఉండటం, అధికారాన్ని పోగొట్టుకోవడం.. ఇవన్నీ మామూలే. రాజకీయ నాయకులకు ఓర్పు, నేర్పు, సహనం, నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కానీ జగన్ పరిస్థితి అది కాదు. కిందిస్థాయి నాయకులు మాట్లాడే భాషను ఆయన వాడుతున్నాడు. తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నాడు. వాస్తవానికి ఇలాంటి అనాగరిక భాష వాడి తెలంగాణ ప్రజల్లో ఆంధ్రా పట్ల విద్వేషం రెచ్చగొట్టిన మొదటి వ్యక్తిగా కేసీఆర్‌కు ఆ అర్హత దక్కుతుంది. ఉద్యమ సమయంలో ఆయన ఆంధ్రులు కూడా మనుషులే అన్న విషయాన్ని మరిచి ఎంతలా మాటలతో రెచ్చిపోవాలో అంతలా రెచ్చిపోయి తన భాషతో అందరినీ నిశ్చేష్టులను చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది.
ఇప్పుడు అదే భాషను ఏపీలో ప్రతిపక్ష నాయకుడైన జగన్ వాడుతున్నాడు. ఎంతైనా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మెజార్టీ ప్రజలు ఆయన్ను సీఎంగా చేయడానికి ఇష్టపడ్డారనేది వాస్తవం. ఆయన తప్పోప్పులు, ఇంకేమైనా అవినీతి, ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి లోపాలు ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తమ ఓట్లతో చంద్రబాబుకు బుద్ది చెబుతారు. కానీ జగన్ మాత్రం ఇలా ఆలోచించడం లేదు. ఏకంగా ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలి వంటి తీవ్ర పదజాలం వాడుతున్నాడు. ఇది అందరికీ జుగుప్సను కలిగిస్తుంది. తన తండ్రి వయసున్న ముఖ్యమంత్రిని జగన్ చెప్పులతో కొట్టాలి అని మాట్లాడటం ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన విషయం. ఓ వైపు చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు అంటూనే మరోపక్క తెలుగుదేశం పార్టీని కూల్చివేస్తాను అంటున్నాడు. మెజార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో ఉన్నప్పుడు జగన్ టిడిపిని కూల్చడం ఎలా సాధ్యం అవుతుంది....? అంటే ఆయన కూడా టిడిపి ఎమ్మేల్యేలను కొంటాడా? అనే అనుమానం రాకమానదు. మరోపక్క ఆయనకు కొమ్ము కాసే మీడియా జగన్ ఎమ్మేల్యేలను చంద్రబాబు 30, 40 కోట్లు ఇచ్చి కొంటున్నాడు అని ఆరోపిస్తోంది. మరి జగన్ వైసీపీ పార్టీని పెట్టినప్పుడు ఎందరో ఎమ్మేల్యేలు, అన్ని పార్టీల నాయకులు ఆయన వెంట నడిచారు. మరి వారిని జగన్ ఎంత పెట్టి కొన్నాడు? వారికి తన వెంట నడిచినందుకు ఎంత మొత్తం పంచాడు? అనే ప్రశ్నలకు జగన్ వద్ద సమాధానం ఉందా? అది జగన్ విజ్ఞతకే వదిలేయడం సమంజసం.