ప్రస్తుతం తన చేతిలో పది పైసలు కూడా లేవని, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని పవన్ నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. జనసేన ఆవిర్భావ వేడుకలో కూడా పవన్ ప్రస్తుతం తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందని, మరలా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే తాను సినిమాల్లో నటించక తప్పదని తెలిపాడు. పవన్ సంపాదన కేవలం సినిమా రెమ్యూనరేషన్లు మాత్రమే అని అందరికీ తెలుసు. తండ్రులు సంపాదించిన పెట్టినవి ఏమీ లేవు. పోనీ మహేష్‌బాబులాగా పలు కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం ఆయనకు నచ్చదు. ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాడు. మరి 2019లో ఆయన తన జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కానీ ఈ రోజుల్లో ఓ పార్టీనీ నడపడం అంటే ఆషామాషీ కాదు. కోట్లలో ఖర్చు ఉంటుంది. సభలు, సమావేశాలు, సంస్థాగత పటిష్టత వంటివి అంత సులభం కాదు. జగన్‌లాంటి వారికైతే తండ్రులను అడ్డం పెట్టుకొని సంపాదించిన లక్షల కోట్లు ఉన్నాయి. కానీ పవన్ చేతిలో ఇవేమీ లేవు. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే లోపు వీలున్నన్ని సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అదే ఉద్దేశ్యంతో ఆయన వరసగా మూడు చిత్రాలు చేస్తున్నాడు. వీలుంటే మరో మూడు సినిమాల్లో కష్టపడటానికైనా ఆయన సిద్దమే. అయినా కూడా పార్టీని నడపడానికి అవి ఎంతకు సరిపోవు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తే పవన్ పరిస్థితి ఏమిటి? అని కొందరు అవహేళన చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది పవన్ అభిమానులు ఢిల్లీలో అధికార పీటాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీని, దాని నాయకుడు కేజ్రీవాల్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. కేవలం కొద్ది పాటి ఫండ్స్‌తోనే కేజ్రీవాల్ పార్టీని నడిపించి, మోదీకే షాక్ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా పవన్ ఇలాంటి విజయాన్నే సాధిస్తారని ఆశావహులు భావిస్తున్నారు.