ఇటీవలే హీరోలుగా పరిచయం అయిన సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు. కానీ పట్టుమని నాలుగైదు చిత్రాలు కూడా చేయని ఈ మెగాక్యాంప్ హీరోలు ఇప్పుడే ఓవర్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తాజాగా వరుణ్‌తేజ్-శ్రీనువైట్ల 'మిస్టర్', సాయిధరమ్‌తేజ్ చేయనున్న గోపిచంద్ మలినేని చిత్రాలు క్రియేటివ్ డిఫరెన్స్‌ల వల్ల ఆలస్యమవుతున్నాయని సమాచారం. వాస్తవానికి వరుణ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'ముకుంద'ను నిర్మించిన ఠాగూర్‌మధు, నల్లమలుపు బుజ్జిలే శ్రీనువైట్లతో కలిసి 'మిస్టర్'ను తెరకెక్కించనున్నారు. దాంతో 'ముకుంద'లో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, ఆ చిత్రం బయ్యర్లకే ఈ 'మిస్టర్' చిత్రాన్ని తక్కువ ధరకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే నిర్మాతలు వరుణ్‌తేజ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. కిందటి చిత్రంలో తాము నష్టపోయాము కాబట్టి రెమ్యూనరేషన్‌లో కాస్త రాయితీ ఇవ్వాలని నిర్మాతలు వరుణ్‌తేజ్‌ను అడిగినా వరుణ్ మాత్రం నో అని చెప్పాడట. తాను అడిగిన రెమ్యూనరేన్ తనకి ఇవ్వాలని, అందులో పైసా తగ్గినా ఒప్పుకునేది లేదని అన్నాడట. కానీ పైకి మాత్రం ఈ చిత్రం సెకండ్ పార్ట్ వరుణ్‌కు నచ్చలేదని, ఆ క్రియేటివ్ డిఫరెన్స్‌ల వల్లే సినిమా లేటవుతోందని అంటున్నారు. ఇక సాయి ధరమ్‌తేజ్ -గోపీచంద్ మలినేని సినిమా కూడా ఇలాంటి కారణాల వల్లే ముందుకు సాగడం లేదని అంటున్నారు. మరీ గిరి గీసుకొని ఉండకుండా కాస్త పట్టు విడుపులు చూపించాలని ఈ ఇద్దరు మెగాహీరోలకు పలువురు సూచిస్తున్నారు.