వాస్తవానికి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లందరిలో ఎక్కువ పారితోషికం తీసుకునేది ఎవరు? అంటే అందరూ ఏ సమంత పేరునో లేక కాజల్ పేరునో చెబుతారు. కానీ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటోంది మాత్రం స్వీటీ అనుష్కనే. తాజాగా ఆమె 'పిల్లజమీందార్' ఫేమ్ అశోక్ దర్శరత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'భాగమతి' అనే థ్రిల్లర్ మూవీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అనుష్క అందుకున్న పారితోషికం అక్షరాలా మూడు కోట్లు అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే అనుష్కనే టాలీవుడ్‌లో పారితోషికం విషయంలో నెంబర్‌వన్ అని అర్థమవుతోంది. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ చరమాంకంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తారు. కానీ అనుష్క మాత్రం తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 'అరుంధతి' వంటి చిత్రంలో నటించింది. ఓ విధంగా చెప్పాలంటే టాలీవుడ్‌లో విజయశాంతి తర్వాత అంతటి పెద్ద ఇమేజ్‌ను సంపాదించుకున్న నటిగా అనుష్కను చెప్పవచ్చు. కాగా 'భాగమతి' చిత్రంలో మలయాళ హీరో జయరాం విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన గడ్డం పెంచి, గుండుతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. మరి ఈ చిత్రం పూర్తయిన తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా జరిగి, వివాహం చేసుకొని సెటిల్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.