తన తర్వాత తన వారసుడిగా నారా లోకేష్‌ను సమాయత్తం చేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన మహానాడులో కొందరు కార్యకర్తలు లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేస్తూ, ప్లేకార్డ్‌లు ప్రదర్శించడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క లోకేష్ కూడా ప్రస్తుతం తనకు మంత్రి పదవి వద్దని, 2019కి తాను సిద్దంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన రాజ్యసభ సభ్యులలో టి.జి.వెంకటేష్‌కు చోటివ్వడంలో కూడా లోకేష్ కీలకపాత్ర పోషించాడు. దానికి తగ్గట్లుగా మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా తన నిర్ణయాల వెనుక లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు చాలాసార్లు సంకేతం ఇస్తూనే ఉన్నాడు. ఏదైనా పని ఉంటే తనను కలిసేముందు లోకేష్‌ని కలవాలని ఆయన సీనియర్లకు కూడా చిన్నపాటి సంకేతాలను పంపిస్తున్నాడు. ఇక కొన్నిసార్లు తాను తీసుకునే కీలకనిర్ణయాల వెనుక లోకేష్ ఉన్నాడని ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇస్తున్నాడు. ఇక మహానాడులో అయితే చంద్రబాబు ప్రసంగం తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లు ప్రధానులు అయ్యే క్రమంలో జ్యోతిబసు తనను పిఎం పదవి తీసుకోవాలని పట్టుబట్టాడని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదని సెలవిచ్చాడు. ఆ సమయంలో లోకేష్ 9వ తరగతి చదువుతున్నాడట. అప్పుడు లోకేషే చంద్రబాబుకు ప్రధాని పదవి తాత్కాలికం అని చెప్పాడని, లోకేష్ మాట విన్న తర్వాతే తాను ప్రధాని పదవి వద్దనుకున్నానని అన్నాడు. ఇది వినడానికి కాస్త ఓవర్ అనిపించినా తన కుమారుడికి రాజకీయంగా ఎంతో పరిజ్ఞానం ఉందని, కాబట్టి అతనిదే ఫైనల్ డెసిషన్ అని నాయకులకు, కార్యకర్తలకు ఆయన ఇన్‌డైరెక్ట్‌గా సూచించాడు అంటున్నారు విశ్లేషకులు...!