ఏపీ నుండి రాజ్యసభకు సుజనాచౌదరిని ఈసారి పంపరని, ఆయనపై ఆల్‌రెడీ బ్యాంకులను మోసం చేశాడని ఆరోపణలు ఉండటంతో చంద్రబాబు ఆయన్ను పక్కన పెడతారనే వార్తలు వినిపించాయి. కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు ఆర్ధికంగానే కాదు.. పార్టీకి ఎన్నో విధాలుగా సాయం చేసిన సుజనా పట్ల మొదటి నుండి బాబు సానుకూలంగానే ఉన్నాడని అర్ధమవుతోంది. అందులో సుజనా ప్రస్తుతం కేంద్రమంత్రిగా కూడా ఉన్నాడు. అదే సుజనాపై వచ్చిన ఆరోపణలు నిజమైతే మోడీకి ఆయన్ను మంత్రివర్గం నుండి తొలగించడం నిమిషం పని, కావాలంటే ఆస్దానంలో మరో టిడిపి వ్యక్తికి చాన్స్ ఇచ్చేవాడు. కానీ సుజనాపై ఉన్న ఆరోపణలను ఇటు చంద్రబాబు, అటు అవినీతిని ప్రోత్సహించని మోడీ లు నమ్మడం లేదనే తెలుస్తోంది. మరోపక్క ఈ మధ్యకాలంలో చినబాబు నారా లోకేష్‌కు, సుజనాకు సరిగ్గా పడటంలేదనే వార్తలు కూడా షికారు చేశాయి. అయినా కూడా సుజనాపై చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ ఉందనేది అర్థమవుతోంది.
అలాగే రాజ్యసభకు టిడిపి తరపున రెండో అభ్యర్ధిగా బరిలో నిలిచిన టిజి వెంకటేష్‌ను ఎంపికచేయడం మాత్రం చినబాబు కోరిక మీదనే జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రాయలసీమ విషయంలో కొందరు నాయకులు చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తున్నారు. రాయలసీమ ప్రజలు కూడా చంద్రబాబు పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో రాయలసీమకు చెందిన వ్యక్తికి పదవి ఇవ్వడం చాలా మంచిదని చినబాబు తన తండ్రికి సూచించాడట. మరోవైౖపు ఆర్యవైశ్యునికి ఈ పదవి ఇవ్వడం ద్వారా వైశ్యులను కూడా తనవైపుకు తిప్పుకోవచ్చు. మరోరకంగా చూస్తే టి.జి.వెంకటేష్ చాలా స్థితిమంతుడు, ఆర్ధికంగా బలవంతుడు. భవిష్యత్తులో ఈ వ్యాపారవేత్త ఆర్ధికంగా కూడా టిడిపి కి వెన్నుదన్నుగా ఉంటాడని బాబుతో పాటు చినబాబు భావించారు. ఓ ఛానెల్‌లో టిజి వెంకటేష్ తనకు అండగా నిలిచిన నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలపడం ద్వారా ఆయన ఎన్నికకు చినబాబు బాగానే కృషి చేసినట్లు అర్థమవుతోంది.