కోటి ఎకరాలకు నీరు, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, గడపగడపకి మంచి నీరు, అవినీతి లేని పాలన... ఇవన్నీ ప్రతి రోజు ప్రింట్ మీడియాలో కనిపించే పెద్దపెద్ద హెడ్డింగ్ వార్తలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళు అవుతోంది. సంబరాలకు సమయమైంది. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంత వేడుకలు జరుపుతున్నారు. ఇదంతా చెప్పుకోవడానికి బాగనే ఉంది. కానీ అలా జరుగుతోందా.. కేసీఆర్ పాలన జనరంజకంగా ఉందా? ఉప ఎన్నికల్లో గెలిస్తే ప్రజామోదం ఉన్నట్టేనా.. ఈ అనుమానాలు సామాన్యుల్లో ఉన్నాయి. కానీ వారికి నిజాలు తెలిసేదెలా?.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండాల్సిన తెలుగు మీడియా కేసీఆర్ కు దాసోహం అంటోంది!! ఆయనకు అనుకూల వార్తలే రాస్తోంది. ప్రతిపక్షంను నిర్వీర్యం చేసే వలసలపై మీడియా ప్రశ్నించలేకపోతోంది. అవినీతిని వెలికి తీయలేకపోతోంది. తెలంగాణలోని ప్రింట్ మీడియా కేసీఆర్ కు అణిగిమణిగి ఉండడానికి కారణం ఏమిటీ...? కేవలం భయమేనా! (ఈనాడు, వార్త, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సూర్య)
మీడియా మొత్తం ఆంధ్రుల చేతుల్లో ఉంది. వారికి స్థిర, చరాస్థులు తెలంగాణలో ఉన్నాయి. ప్రతిపక్షాన్ని బెదిరించి తన దారిలోకి తెచ్చుకున్నట్టుగానే, మీడియాకు సైతం కేసీఆర్ కళ్లెం వేసేశారు. నిన్నామొన్నటి వరకు కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించిన ఆంధ్రజ్యోతి సైతం ప్లేట్ ఫిరాయించి భజన చేస్తోంది.
సహజంగా పాలకులు జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో మాత్రం మీడియా అధినేతలే భయపడే పరిస్థితి వచ్చిందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయం మీడియా యాజమానుల్లో ఉందని జర్నలిస్టులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
అవినీతి రహిత పాలన ఇస్తున్నామంటూ కేసీఆర్ చెప్పిందానిని అక్షం పొల్లుపోకుండా ప్రచురించారు. కానీ వాస్తవంగా జరుగుతోందేమిటీ, దీనిపై ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నా ఆ వార్తలు లోపటి పేజీల్లో వేస్తున్నారు కానీ, ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవగానే అవినీతి అంతరించి పోతుందా, అధికారుల్లో ఓవర్ నైట్ మార్పు వస్తుందా... ప్రతి రోజు ఏసీబి కి చిక్కుతున్న అధికారులే దీనికి నిదర్శనం. కొందరు మంత్రులు, శాసనసభ్యులు ఖరీదైన భవంతులను ఎలా కొనుగోలు చేస్తున్నారు ఈ ప్రశ్నలు మీడియాకు కనిపించడం లేదా... వారి ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తును బలి చేస్తున్నారు. ఇప్పటికైనా మీడియా కళ్ళు తెరవాలి.