కాపు ఉద్యమం కోసం సిద్దమవుతున్న ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. కాపుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్‌పార్టీ నాయకులతో, కాపులను పట్టించుకోని పవన్‌తో ముద్రగడకు ఉన్న పనేంటి? అంటూ ఆయన తీవ్ర విమర్శ చేశారు. అయితే ఆయన పవన్‌ను ఈ వివాదంలోకి లాగడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కేవలం ఒక కులనాయకుడిగా, కులనేతగా ఎప్పుడు చెప్పుకోలేదు. జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలోనే ఆయన ఆ క్లారిటీ ఇచ్చాడు. తాను తన అన్నయ్య చిరంజీవిని, కాంగ్రెస్‌ను వదిలేసి బిజెపి, టిడిపిలకు మద్దతు పలికే సమయంలో కొందరు కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. దాని గురించి పవన్ మాట్లాడుతూ.. నాకు అన్ని కులాలు సమానమే. నేను రాజకీయాల్లోకి వచ్చి కొత్తపార్టీ పెట్టడం కొందరు కాపునేతలకు ఆగ్రహం తెప్పించింది. కానీ నాకు అలాంటి వారి మద్దతు అవసరం లేదు... అని సంచలన ప్రకటన చేశాడు. తద్వారా తాను కాపు వాడిని కాదని, అందరివాడిని అని తేల్చిచెప్పాడు. నిజానికి ఆయనకి అన్ని కులాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాల్సివస్తే ఆయనకు కాపులలో కంటే ఇతర కులాలలోనే వీరాభిమానులు ఉన్నారు. ఈ విషయం గుర్తించలేకపోవడం, పవన్‌ను కార్నర్ చేస్తూ మాట్లాడటం చినరాజప్పకు తగునా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు తాను మాత్రం అన్ని విషయాలలోనూ మౌనంగా ఉంటూ తన తోటి వారిచేత మాత్రం తనకు పెద్దగా పడని వారిని టార్గెట్ చేయిస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.