భారతదేశంలోని సినిమాకు సంబంధించిన ప్రతి పురస్కారం నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును వరించింది. పద్మ విభూషణ్ అందుకున్న తొలి సినిమా వ్యక్తి కూడా ఆయనే. ఎలాంటి నేపథ్యం లేనప్పటికీ, చదువు కూడా రానప్పటికీ, కేవలం ప్రతిభను నమ్ముకుని ఎదిగిన నటుడు అక్కినేని. అలాంటి మహానటుడి పేరును భారతరత్న పురస్కారానికి ప్రతిపాదించక పోవడం సబబు కాదు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఎన్టీఆర్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. అయినప్పటికీ భారతరత్న పురస్కారం ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు పురస్కారం ప్రకటిస్తే దాన్ని ఎవరు తీసుకుంటారు?. భార్య బతికే ఉంది కాబట్టి ఆమెకు ఇవ్వాలి. అయితే ఎన్టీఆర్‌తో జరిగిన లక్ష్మీ పార్వతి వివాహాన్ని వారసులే గుర్తించడం లేదు. కాబట్టి పురస్కారాన్ని కుమారులే తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది వివాదం అవుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. ఇక రాజకీయ కారణాల వల్ల ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చారనే అపవాదు కూడా వస్తుంది. ఎందుకంటే ప్రస్తుత బిజేపి ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి. అందుకే ఎన్టీఆర్ విషయంలో పురస్కారం ప్రతిపాదన వాయిదా పడుతూ వస్తుందని భావించవచ్చు.
అక్కినేని విషయానికి వస్తే ఆయన పూర్తిస్థాయి నటుడు. ఎన్టీఆర్ కంటే సీనియర్. రాజకీయ నేపథ్యం లేదు. మహానటుడిగా కీర్తింపపడ్డారు. ఆయన గౌరవానికి సూచికగా ఎన్నో పురస్కారాలు దక్కాయి. కాబట్టి భారతరత్నకు కూడా ఆయన అర్హుడే అవుతారు. నిజానికి ఈ విషయంపై మాట్లాడాల్సింది వారసత్వాన్ని అనుభవిస్తున్న ఆయన కుమారులు. కానీ వారికి ఆ ఆలోచన ఉన్నట్టు లేదు. అక్కినేని దూరమైన తర్వాత ఆయన స్మారకార్థం ఏదైనా చేయాలనే తలంపు కూడా వారసుల్లో లేదనిపిస్తోంది. అందుకే అక్కినేనికి నిజమైన వారసులు అభిమానులే అవుతారు. కాబట్టి వారి నుండి భారతరత్న డిమాండ్ వస్తే బావుంటుంది.
గానకోకిల లతామంగేష్కర్, క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌లకు భారతరత్న గౌరవం దక్కినపుడు సుదీర్ఘ నటజీవితం కలిగి, సినీ పరిశ్రమకు సేవలు అందించిన అక్కినేనికి కూడా ఆ గౌరవం దక్కడం సముచితం. ఈ విషయంపై తెలుగు చిత్ర పరిశ్రమ కూడా స్పందిస్తే బావుంటుంది.