తంతే గారెల పుట్టలో పడినట్టుగా మాజీ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కు రాజ్యసభ టికెట్ లభించింది. సొంత నియోజకవర్గంలో అనేక సార్లు ఓడిపోయిన ఈ నేత పదవి లేకుండా ఎక్కువ రోజులు ఉండలేరని రాజకీయ వర్గాల్లో సరదాగా చెప్పుకుంటారు. తెరాసలో చేరి క్యాబినెట్ హోదా ఉన్న సలహాదారు పదవి పొందారు. రాజ్యసభ టికెట్ రావడంతో దానికి రాజీనామా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. సలహాదారుగా ఆయన చేసిన నిర్వాకం ఏమిటీ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో ప్రాజెక్ట్ ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనపుడు అంతరాష్ట్ర వివాదాల సలహాదారు హోదాలో డి.శ్రీనివాస్ చేసింది శూన్యం. అసలు వాటిపై నోరు విప్పలేదు. నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటూ ఇన్ని నెలలు ఎలాంటి ప్రగతి చూపించలేకపోయారు. ఒకటవ తరగతి పిల్లాడు రెండవ క్లాస్ కు వెళ్ళాలంటే ప్రోగ్రెస్ ఉండాలి. కానీ ఎలాంటి ప్రోగ్రెస్ లేని డి.శ్రీనివాస్ ఏకంగా రాజ్యసభకు ఎంపికవుతున్నారు.
డిల్లీలో తనకున్న పలుకుబడితో బంగారు తెలంగాణకు కృషి చేస్తానని డి.ఎస్. అంటున్నారు. పలుకుబడి ఉంటే పదవి ఎందుకు.ఇంతకాలం ఆ పరిచయాలను ఆయన ఎందుకని ఉపయోగించలేదు. రాష్ట్రానికి ఏం చేయలేకపోయారు. అలాంటి డి.ఎస్. రాజ్యసభ సభ్యుడిగా ఏదో చేస్తారనుకుంటే అత్యాశే అవుతుంది.