కాపు రిజర్వేషన్ల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం రోజుకో వేషం వేస్తున్నాడు. కిందటి ఎన్నికల్లో పదివేల ఓట్లు కూడా సాధించలేని ముద్రగడ ఇప్పుడు కాపులందరికి తానే ప్రతినిధిని అనే భ్రమలో ఉన్నారు. ఇంతకాలం ఆయన వెనుక జగన్ ఉండి ఇవ్వన్నీ నడిపిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. ఆ అపవాదు నుండి తప్పించుకునేందుకు ముద్రగడ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను, ఇతర పార్టీలలోని కాపు నాయకుల మద్దతును కూడగట్టి జగన్‌కు మౌత్‌పీస్ అనే విమర్శలకు తెరదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ నేత చిరంజీవిని, దాసరి నారాయణరావులతో పాటు రఘువీరారెడ్డి, పళ్లంరాజు, బొత్స సత్యనారాయణ వంటి నేతలను కలిసి చర్చించారు. వారు కూడా ముద్రగడకు మద్దతు తెలిపారు. కాగా కాపు గర్జన సమయంలో తన ఇంటిలో తనను తాను నిర్బందం చేసుకొని తన వద్దకు వచ్చే వారిని కలవడానికి సుముఖత చూపని ముద్రగడ్డ ఇప్పుడు అందరు నేతలతో కలిసి తిరగడాన్ని, హైదరాబాద్ వచ్చి మరీ ప్రత్యేకంగా కలవడాన్ని టిడిపి నాయకులు తప్పుపడుతున్నారు.
ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ముద్రగడ.. పళ్లంరాజును కలిసినప్పుడు ఆయన ఫోన్‌లో పవన్‌కళ్యాణ్‌తో ముద్రగడను మాట్లాడించాడని అంటున్నారు. పవన్ కూడా ఆయనకు మద్దతు ఇస్తానన్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముద్రగడ కాపు గర్జన సందర్భంగా రైలును తగులబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం వంటివి పవన్‌కు గుర్తుండే ఉంటాయి. తుని సంఘటనలను పవన్ మర్చిపోయాడనుకుంటే పొరపాటే. అయితే పవన్ మర్యాదపూర్వకంగానే తన మద్దతు ఉంటుందని తెలిపాడని, కానీ ఆయన ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కానీ, వ్యతిరేకించడం గానీ చేయకుండా తటస్థంగా ఉంటాడని కొందరు విశ్లేషిస్తున్నారు.