నేడు మహామహానాయకులకు కూడా కులం రంగు పూసి ఓ కులానికి నేతలుగా వారిని మార్చేస్తున్నారు. పి.వి నరసింహారావు అంటే బ్రాహ్మణుడని, గాంధీ అంటే వైశ్యుడని... అంబేద్కర్ అంటే దళితుడని... ఇలా రంగులు పులిమేస్తున్నారు. ఈ తరుణంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గానికే పరిమితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలలో తిరుగులేని చక్రవర్తిగా, రాజకీయాల్లో ఆంధ్రులను చైతన్యం చేసిన మహానుభావుడిగా ఆయనకు ఘన చరిత్ర ఉంది. కానీ అది గతం. టిడిపి కూడా ఎన్టీఆర్‌ను కేవలం కమ్మ కులానికే పరిమితం చేసేలా ప్రవర్తిస్తుండటం విషాదకరం. మిగిలిన కులాల వారు కూడా ఎన్టీఆర్‌ను అలాగే చూస్తున్నారు. దానికి తోడు తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ బలంగా ఉండటంతో చాలా మంది ఆయన్ను ఆంధ్రా ప్రాంతానికే ఎక్కువ పరిమితం చేయడం దురదృష్టకరం. వాస్తవానికి ఆయన తెలంగాణకు ఎన్నో మంచి పనులు చేశారు. జీవో 610ని తెచ్చింది ఆయనే. ఆ జీవో అమలు కోసమే కేసీఆర్ నిరాహారదీక్ష చేయడం చివరకు అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా మారడం తెలిసిందే. ఇక తెలంగాణలో వెట్టిచాకిరికి, కొన్ని కులాల దురహంకారాన్ని తగ్గించడానికి ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎందరికో విముక్తి కలిగించారు. ఇలాంటి ఎన్టీఆర్‌కు 'భారతరత్న' ఇవ్వాలని ఎప్పటి నుండో చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు. ఏదో మహానాడు జరిగే సమయంలోనో, లేక ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ 'భారతరత్న' డిమాండ్‌ను లేవనెత్తుతున్నాడు తప్ప చిత్తశుద్దిగా ఆయన అందుకు కృష్టి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాజ్‌పేయ్ హయాంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఆ సమయంలో ఎన్టీఆర్ భారతరత్న విషయంలో గట్టిగా పోరాటం చేయలేదు. ఇప్పుడు కేంద్రంలోని బిజెపికి మిత్రపక్షమైనా కూడా ఆయన ఆ విషయంలో మాటలు తప్ప చేతలు చూపించడం లేదు. అయినా ఎన్టీఆర్ వంటి మహానుభావులకు ఈ బిరుదులు, గౌరవాలు, అలంకరణలు అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతుండగా, రామోజీరావుకు 'పద్మ' పురస్కారం ఇప్పించడంలో పెట్టిన శ్రద్ద ఎన్టీఆర్ భారతరత్నపై పెట్టకపోవడం ఏమిటని? మరికొందరు విమర్శిస్తున్నారు.