వాస్తవానికి అంబేద్కర్ రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నప్పుడు భవిష్యత్తులో అవి ఎంత ప్రమాదకరంగా మారుతాయో? వాటిని మన రాజకీయనాయకులు ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటారో ఆయన ఊహించి వుండడు. అయినప్పటికీ ఆయన ఇంకాస్త ముందుచూపుతో కొంతకాల వ్యవధికే ఈ రిజర్వేషన్లను పరిమితం చేయాలని, లేకపోతే దుష్ఫ్రరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించాడు. ఆయన అనుకున్నట్లు గానే ప్రస్తుతం సమాజంలో రిజర్వేషన్ల వికృతరూపం బయటపడుతోంది. ఆర్దిక, సామాజిక సమానత్వాన్ని సాధించిన తర్వాత కూడా మన నాయకులు రిజర్వేషన్లను పొడిగిస్తూనే ఉన్నారు. దీంతో ఉత్తరభారతంలో పటేళ్లు, దక్షిణాదిలో కాపులు వంటి సామాజిక వర్గాలు రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహానాడులో చంద్రబాబు అగ్రవర్ణాలలోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తాం అని తీర్మానించడం హర్షణీయమే. కానీ ఇలా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే అన్ని కులాలు తమకు రిజర్వేషన్లు కావాలనే పట్టుబట్టే పరిస్థితి ఎదురవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిన మన నాయకులు రిజర్వేషన్లను పెంచడం తప్పితే, తగ్గించే దిశగా సరైన చర్యలు తీసుకోకపోవడం కొన్ని సామాజిక వర్గాలకు కోపాన్ని తెప్పిస్తోంది. ఏదో ఒకరోజున వారు పోరాటానికి సిద్దమయే పరిస్థితులను కొందరు కుల నాయకులు, రాజకీయనాయకులు కల్పిస్తున్నారు. ఆర్ధికపరంగా వెనుకబడిన వారికి తప్ప మిగిలిన వారికి రిజర్వేషన్లు కల్పించడాన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. నిజానికి వివిధ కులాలకు లభిస్తున్న రిజర్వేషన్లు కేవలం అతి కొద్ది మంది చేతిలో మాత్రమే ఉండిపోయి, నిజంగా ఆ ఫలాలు అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయి.