వాస్తవానికి చంద్రబాబు ఏ విషయంపైన అయినా ఆచితూచి మాట్లాడుతాడు. కానీ ఈమధ్యకాలంలో మాత్రం ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇంతలోనే బాబు ఇలా మారిపోవడానికి కారణం ఏమిటి? అనేది అర్ధం కావడంలేదు. వయసు పైబడిన కొద్ది వచ్చే చాదస్తమే దీనికి కారణమా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఆమధ్య ఒకసారి తన కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన 'జనాభాను పెంచుకోవాలని' పిలుపునిచ్చారు. మరో సందర్భంలో 'కోడలు మగబిడ్డను ఇస్తానంటే అత్త వద్దంటుందా?' అనే సామెత వాడాడు. మరోసారి 'ఎవరైనా ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఎందుకు పుట్టాలనుకుంటారు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కలెక్టర్ల సమావేశంలో 'ప్రజలు పాపాలు ఎక్కువ చేస్తున్నారు. అందుకే దేవుడికి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు. దాంతో అధికారులకు, మంత్రులకు శ్రమలేకుండానే ఆ శాఖ అదాయం పెరిగిపోతోంది. కానీ అదే సమయంలో జనాలు మద్యం మానివేయడం కోసం మాలలు వేస్తూ దీక్షలు చేస్తున్నారు. దాంతో మద్యం అమ్మకాలు తగ్గినా, దేవాలయాల్లోని హుండీలకు మాత్రం ఎక్కువ ఆదాయం వస్తోందని' కామెంట్ చేయడం చూస్తే చంద్రబాబు కావాలనే అలా మాట్లాడుతున్నాడా? లేక ఇంకేమైనా ఉద్దేశ్యం ఉందా? అనే సందేహం రాకతప్పదు.