విజయవాడ వాసి అయిన పొట్లూరి వరప్రసాద్ ఒక్కో మెట్టు ఎక్కుతూ మిలియనీర్‌గా మారాడు. మొదట్లో సినీ ఫైనాన్షియర్‌గా ఉన్న ఆయన ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో తాను కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయిని సినిమాల్లో పెట్డాడు. 2011లో ఆయన తానే నిర్మాతగా యాత్రకు శ్రీకారం చుట్డాడు. 'రాజాపట్టై' సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు డజన్ చిత్రాలను నిర్మించారు. రవితేజతో ఆయన తీసిన 'బలుపు' చిత్రం కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించుకుంది. ఇక ఆయన కెరీర్‌లో భారీ నష్టాలను తెచ్చిన రెండు చిత్రాలు అనుష్కవే కావడం గమనార్హం. సెల్వరాఘవన్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'వర్ణ', ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో నిర్మించిన 'సైజ్‌జీరో' చిత్రాలు పివిపికు భారీనష్టాలను తీసుకొని వచ్చాయి. ఇక నాగార్జున, కార్తి కాంబినేషన్‌లో వంశీపైడిపల్లితో నిర్మించిన 'ఊపిరి' చిత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ ఓవర్ బడ్జెట్ కారణంగా నష్టాలనే మిగిల్చింది. అలాగే మ్యాట్నీ సంస్థ భాగస్వామ్యంతో లోబడ్జెట్‌లో నిర్మించిన 'క్షణం' చిత్రం లాభాలను సంపాదించిపెట్టింది. ఇక తాజాగా ఆయన నిర్మించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఎలాంటి పరాజయం పొందిందే అందరికీ తెలిసిందే. మొత్తం మీద తనకున్న సినీ మోజులో పివిపి ఇప్పటివరకు పోగొట్టుకున్న మొత్తం 100కోట్లకు పైమాటే అని సమాచారం.