వెంకయ్య నాయుడు గారి మాటలు వెంటే ఎవరికైనా పాత సామెత 'కర్ర విరగకూడదు. పాము చావకూడదు' గుర్తుకు రావడం ఖాయం. ఏపీలోని తెలుగుదేశం పార్టీతో బిజెపికి మంచి అనుబంధం ఇంకా కొనసాగుతోందని, ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయని, విడిపోతే రెంటికి నష్టమే అని వెంకయ్యనాయుడు అంటున్నారు. పనిలో పనిగా తమ ఇద్దరి మద్య అగాధం సృష్టించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన సెలవిచ్చారు. నిజానికి ప్రత్యేకహోదా, కేంద్రం నుండి నిధులు విషయంలోనే ఈ రెండు పార్టీల మద్య విబేదాలు మొదలయ్యాయి. కేవలం కేంద్రం వైఖరి వల్లే రాబోయే రోజుల్లో టిడిపిని పక్కనపెట్టి తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో, ఏపీలో వైయస్సార్‌సీపీతో బిజెపి నడవబోతోందనే అనుమానాలు తలెత్తాయి. ఇలా తప్పంతా తమవైపు పెట్టుకొని వెంకయ్య నాయుడు మాత్రం ఎవరో తమ ఇద్దరి మద్య అగాధం సృష్టిస్తున్నారని అంటున్నాడు. మరి వెంకయ్య దృష్టిలో బిజెపి, టిడిపిల మధ్య చిచ్చు పెడుతోంది కాంగ్రెస్, వైయస్సార్‌సీపీలే అని అర్ధం అవుతోంది. ఆ పార్టీలకు అలాంటి అవకాశం ఇచ్చింది తామే అని మరిచి దానిని కూడా రాజకీయం చేయాలని వెంకయ్య చేస్తోన్న ప్రయత్నం ఆయన్ను నవ్వులపాలు చేస్తోంది. తప్పంతా తామే చేస్తూ బయటికి మాత్రం ఇతరులపై నెపం నెట్టే ప్రయత్నం వెంకయ్య చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ టిడిపి, బిజెపి నాయకులు పరస్పరం విమర్శలు చేసుకొంటున్న విషయం వెంకయ్యకు తెలియదా..? ముఖ్యంగా సోము వీర్రాజు, పురందేశ్వరి వంటి వారు టిడిపిని బాగా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ విషయం వెంకయ్యకు తెలియదా? సీనియర్ నేతగా అధిష్టానంతో మాట్లాడి ఈ విమర్శలు తగదని తమ నాయకులకు హెచ్చరించాల్సింది పోయి వేరే పార్టీలే ఇందుకు కుట్రపన్నుతున్నాయని వెంకయ్య వ్యాఖ్యానించడం సమంజసమేనా..?