రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 31వరకు నామినేషన్లను తీసుకుంటారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జూన్3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. జూన్ 11న ఎన్నికలు జరుగుతాయి. ఆ సాయంత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా ఏపీ నుండి నాలుగు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ఇందులో మూడు టిడిపికి దాని మిత్రపక్షమైన బిజెపికి దక్కుతాయి. మిగిలిన ఒక సీటు వైయస్సార్‌సీపీకి దక్కుతుంది. కాగా ఆ ఒక్క సీటును జగన్.. విజయసాయిరెడ్డికి కేటాయించాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆ ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకూడదని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
అందుకు బాబుకు సరైన అభ్యర్థి కూడా దొరికాడు. ఇటీవలే వైసీపీ నుండి టిడిపిలో చేరిన నెల్లూరీయుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాజాగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన కు టిడిపికి లభించే మూడు సీట్లు తనకు వద్దని, వైసీపికి దక్కే ఆ ఒక్క సీటును తాను దక్కించుకుంటానని, కాబట్టి తనకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా చంద్రబాబును కోరాడని సమాచారం. గతంలో వైసీపీ పార్టీకి అన్నివిధాలుగా ఉపయోగపడిన తనకు ఇప్పటికీ వైసీపీ ఎమ్మేల్యేలలో పలువురు అభిమానులు ఉన్నారని, వారితో తనకు ఇప్పటికీ సత్సంబందాలు ఉన్నాయని, వారితో తాను ఓటు వేయించుకోగలనని, అలాగే ఆర్ధిక విషయాలను కూడా తానే చూసుకుంటానని చంద్రబాబుకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. దానికి చంద్రబాబు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని, తమ సహకారం ఆయనకు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో.. ఇప్పుడు వైసీపీకి దక్కనున్న ఒక్క సీటుకు కూడా పోటీ పెరగడం చూస్తే ఈ ఎన్నికలు కూడా చివరి వరకు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందని అంటున్నారు.