ఏ ముహూర్తాన ఏపీకి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడో గానీ చంద్రబాబుకు రోజు రోజుకు సమస్యల మీద సమస్యలు వచ్చిపడుతున్నాయి. రాజకీయ పరిణామాలన్నీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే పరిణమిస్తున్నాయి. ఓవైపు ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన కేంద్రం, రాజధానిని, పోలవరం వంటి ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తి చేయడానికి కేంద్రం నుండి నిధుల కొరత, చివరకి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం సుముఖంగా లేదని, అనేక అడ్డంకులు ఉన్నాయని కేంద్రరైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రకటన, ఇక తెలంగాణ కృష్ణ, గోదావరి నదులపై అక్రమంగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని, కానీ చంద్రబాబు సరిగా స్పందించడం లేదంటూ విపక్షాల దాడి, కాపు రిజర్వేషన్లు, మరోసారి ప్రజలను రెచ్చగొట్టేందుకు ముద్రగడ్డ, జగన్‌లు కలిసి ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్న వైనం, చివరకు విశాఖ పీఠాధిపతి స్వరూపానంద్రేంద స్వామి వారు కూడా చంద్రబాబును డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తపు బలమే సరిగా లేదని స్వరూపానందేంద్రస్వామి వ్యాఖ్యలు.. ఇలా పలు సమస్యలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. ఇక రాజ్యసభలో ఒక సీటు తమ మిత్రపక్షమైన బిజెపికి కేటాయించాలని చంద్రబాబుకు ఉంది. తద్వారా తమకు బిజెపి మద్య ఇంకా మంచి సుహృద్భావం ఉందని తెలియజేయాలని ఆయన భావిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఆ ఒక్క సీటు కోసం బిజెపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబును నామమాత్రంగానైనా అడగలేదట. ఒక్క సీటు కోసం బాబును బతిమాలుకోవాల్సిన అవసరం తమకు లేదని బిజెపి భావన, ఇలా రోజు రోజుకూ చంద్రబాబు ప్రతిష్ఠ దిగజారుతోందని, ఈ సమయంలో చంద్రబాబుకు దూకుడే మంత్రంగా కావాలని టిడిపి నాయకులు సూచిస్తున్నారు.