బిజెపికి చిక్కంతా రాజ్యసభలోనే ఎదురవుతూ ఉంది. లోక్‌సభలో కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం బిజెపికి పెద్ద బలం లేకపోవడం వారికి తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికీ రాజ్యసభలో ఎన్డీయే కంటే యుపిఏ హవానే కొనసాగుతోంది. దీంతో కొన్ని ముఖ్యమైన బిల్లులను రాజ్యసభలో ఆమోదం పొందకుండా పోతున్నాయి. దీంతో బిజెపి అధిష్టానం ఇటీవల ఎన్నికల్లో తమిళనాడులో గెలిచిన అమ్మ జయలలిత, పశ్చిమబెంగాల్‌లో దుమ్మురేపిన అక్క (దీదీ) మమతాబెనర్జీపైనే ఆశలు పెట్టుకుంది. వారిని ఎలాగైనా తమ ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బిజెపి నాయకులు ఉబలాటపడిపోతున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు వంటి వారిని పట్టించుకోకుండా ఇలా జయ చుట్టూ, మమతా చుట్టూ తిరగడాన్ని బాబు వంటి వారు జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. అవసరం అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న కొందరిని పోగొట్టుకున్నా తమకు లోక్‌సభలో వచ్చే నష్టం లేదని, అందుకోసం తమ పూర్తి దృష్టిని రాజ్యసభపైనే కేంద్రీకరించాలని మోడీ, అమిత్‌షాలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మమతాలాగా అంశాల వారి మద్దతు అనే దానిపైనన్నా దృష్టి కేంద్రీకరించాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. అయితే తమపై ఎవ్వరి పెత్తనాన్ని అంగీకరించే మనస్తత్వం లేని డిక్టేటర్లు అయిన జయ, మమతా తృతీయఫ్రంట్‌పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారట.